AP Assembly Budget Sessions: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ(సోమవారం) ప్రారంభమయ్యాయి. ఇవాళ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. గవర్నర్ ప్రసంగం అనంతరం బీఏసీ సమావేశమైంది. ఈ బీఏసీ సమావేశంలో నాలుగు రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నెల 8 వరకూ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. నేడు అసెంబ్లీ సమావేశాలు ముగిసిన అనంతరం స్పీకర్ తమ్మినేని సీతారాం నేతృత్వంలో బీఏసీ సమావేశమైంది. 4 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఏసీలో నిర్ణయించారు. బుధవారం (ఫిబ్రవరి 7న) అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. బుధవారం ఉదయం 11 గంటలకు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెడతారు. శాసనమండలిలో గతేడాది మాదిరిగానే ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా ప్రవేశపెట్టే అవకాశం ఉంది. బీఏసీ సమావేశం అనంతరం స్పీకర్‌తో సీఎం జగన్మోహన్‌రెడ్డి సమావేశమయ్యారు. బీఏసీ సమావేశాన్ని టీడీపీ బాయ్‌కాట్ చేసింది. ప్రభుత్వ వైఖరికి నిరసనగా బీఏసీని టీడీపీ బహిష్కరించింది.టీడీపీ సభ్యులు లేకుండానే బీఏసీ సమావేశం జరిగింది.
Read Also: TDP: గవర్నర్ ప్రసంగం నుంచి టీడీపీ సభ్యుల వాకౌట్
అంతకుముందు రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి గురించి గవర్నర్ ప్రసంగించారు. విజయవాడలో బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించామని.. సాంఘిక న్యాయం, సమానత్వం కోసం మా ప్రభుత్వం పనిచేస్తోందని గవర్నర్ తెలిపారు. ప్రభుత్వం ఇప్పటివరకు 4 బడ్జెట్లు ప్రవేశపెట్టిందని.. ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేసిందన్నారు. రైతుల, యువత, నేత కార్మికులు, వృద్ధులు, మహిళలు ఆర్థికంగా లబ్ధిపొందారని గవర్నర్ ప్రసంగించారు. అధికారంలోకి రాగానే విద్యపై ప్రత్యేకంగా దృష్టి సారించామన్నారు. ఏపీలో మానవాభివృద్ధి సూచిక ప్రమాణాలను పెంచేందుకు నవరత్నాలు ప్రారంభించామన్నారు. పేద పిల్లలకు గ్లోబల్ ఎడ్యుకేషన్ అందిస్తున్నామని అసెంబ్లీలో గవర్నర్ తెలిపారు. స్కూళ్లలో మౌళిక సదుపాయాలు కల్పించామని.. నాడు-నేడు పథకంలో భాగంగా స్కూల్ మెయింటనెన్స్ ఫండ్ అందిస్తున్నామన్నారు. జగనన్న గోరుముద్ధ పథకం ద్వారా 16 రకాల వంటకాలను మధ్యాహ్న భోజనంలో పిల్లలకు అందిస్తున్నామన్నారు. జగనన్న విద్యాకానుక కింద పిల్లలకు యూనిఫాం, బుక్స్ అందిస్తున్నామన్నారు. గోరుముద్ద పథకం కింద రూ.4,416 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. విద్యాకానుక కింద రూ.3367 కోట్లు ఖర్చు చేశామని వెల్లడించారు. 294 ప్రభుత్వ బడులను అప్‌గ్రేడ్ చేశామన్నారు. 8,9 తరగతుల విద్యార్థులకు 9.5 లక్షల ట్యాబ్‌లు అందించామన్నారు. .. జగనన్న వసతి దీవెన కింద ప్రతి విద్యార్థికి 20 వేలు అందిస్తున్నామన్నారు. విదేశాల్లో చదువుకునే విద్యార్థుల కోసం విదేశీ విద్యాదీవెన పథకం అమలు చేస్తున్నామని గవర్నర్ చెప్పారు.