Pawan Kalyan: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నిర్మల దేవి ఫంక్షన్ హాల్లో గౌడ, శెట్టిబలిజ కుల సంఘాల నాయకులతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమావేశం అయ్యారు. అందులో భాగంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. తెలంగాణ తరహాలో ఐదు ఉపకులాలు కలిపి గౌడ కులం ఒక్కటే ఉండాలనేది తన కోరిక అన్నారు. అందుకు బీసీలు అంతా ఏకం కావాలని తెలిపారు. సోషల్ ఇంజనీరింగ్ లో భాగంగా అన్ని కులాల వారికి జనసేనలో అవకాశం ఇస్తున్నామని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. బీసీలకు రాజ్యాధికారం అందాలనేది తన బలమైన కోరిక అని తెలిపారు. కులాల్లో ఒకళ్ళు ఎదుగుతున్నారని.. మరొకరు ఎదగలేదు అనే విషయం పై లోతైన అధ్యయనం జరగాలని నాయకులకు పవన్ కల్యాణ్ సూచించారు.
Read Also: జూలై లో లాంచ్ కానున్న కొత్త స్మార్ట్ ఫోన్లు .. ఫీచర్స్, ధరలు..
ఉపకులాల మధ్య ఐక్యత లేకపోవడం సమస్యగా మారిందని పవన్ కల్యాణ్ ఆరోపించారు. మరోవైపు బీసీల సంక్షేమానికి జనసేన కట్టుబడి ఉంటుందని తెలిపారు. బీసీ కులాలు కచ్చితంగా అధికారంలోకి రావాలని.. బీసీల్లో నలుగురికి పదవులు ఇచ్చి వేల మందికి అన్యాయం చేస్తున్నారని పవన్ మండిపడ్డారు. పంచాయితీ స్థాయి పదవుల్లో బీసీలు ఎంత బలపడితే అంత పైకి వెళ్ళగలరని తెలిపారు. ఈత వనాలను పెంచి కల్లుగీత కార్మికులకు అండగా ఉండాలని జనసేనాని పిలుపునిచ్చారు. అన్నాహజారే స్ఫూర్తితో గ్రామాల్లో 70శాతం కోరుకుంటే అక్కడ మద్యం అమ్మకాలు నిషేధించాలని పవన్ కల్యాణ్ చెప్పారు.
Read Also: Opposition Meeting: విపక్షాల రెండో భేటీ వేదిక మార్పు.. వాతావరణ పరిస్థితుల కారణంగా ఛేంజ్
మరోవైపు సంపూర్ణ మద్యపానం నిషేధం దేశంలో పూర్తిస్థాయిలో అమలైన దాఖలాలు ఎక్కడ లేవని పవన్ కల్యాణ్ అన్నారు. దామాషా పద్ధతిలో బీసీ యువతకు 10 లక్షలు పెట్టుబడి సాయం అందించే విధంగా జనసేన ఆలోచన చేస్తుందని ఈ సందర్భంగా పవన్ తెలిపారు. గౌడ కులస్తుల్ని ముఖ్యమంత్రిగా చూసే రోజు రావాలని.. అన్ని కులాలని కలుపుకుని వెళ్తేనే అది సాధ్యమవుతుందని పవన్ అన్నారు. రెడ్డి, కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారిని అందరూ ఆదరిస్తున్నపుడు.. మిగతా వారిని ఎందుకు ఆదరించడం లేదు అనేది అధ్యయనం జరగాలని పవన్ కల్యాణ్ అన్నారు.