‘వడాపావ్’ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఇండియాలో స్ట్రీట్ ఫుడ్స్ లో చాలా ఫేమస్. ముంబై, మహారాష్ట్రలకు ఎక్కువగా గుర్తింపు పొందిన ఈ స్నాక్ నెమ్మనెమ్మదిగా ఇండియా మొత్తం విస్తరించింది. ప్రస్తుతం ప్రపంచంలోని ఫుడ్ లవర్స్‌ను కూడా మెప్పిస్తోంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం వడాపావ్ అంతర్జాతీయ గుర్తింపును పొందింది. దీనికి అరుదైన గుర్తింపు లభించింది. ప్రపంచంలో అత్యుత్తమ శాండ్‌విచ్‌లలో ఒకటిగా నిలిచింది. ‘టేస్ట్ అట్లాస్’ ప్రపంచంలో అత్యుత్తమ శాండ్‌విచ్‌లతో ఓ జాబితా రూపొందించింది. దీంట్లో వడాపావ్ 19వ స్థానంలో నిలిచింది.
టేస్ట్ అట్లాస్ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో 50 విజేత శాండ్‌విచ్‌ల జాబితాను పోస్ట్ చేసింది. ఇది ప్రపంచంలోని 50 అత్యుత్తమ శాండ్‌విచ్‌ల జాబితాకు సంబంధించి లింక్ షేర్ చేసింది.
వడాపావ్ గురించి మాట్లాడితే.. ఈ ఐకానికి స్ట్రీట్ ఫుడ్ ముందుగా ముంబై దాదార్ రైల్వే స్టేషన్‌లో అశోక్ వైద్య అనే వీధి వ్యాపారి నుంచి ఉద్భవించింది. ఆకలితో ఉన్న కార్మికులకు తక్కువ ధరతో, ఎక్కవ శక్తినిచ్చే వంటకాన్ని సులభంగా తయారుచేయాలని అనుకున్న సమయంలో ఈ వడాపావ్ తయారు చేశారు. ఆ తర్వాత ముంబై వ్యాప్తంగా వడాపావ్ విస్తరించి.. ఇప్పుడు దేశం, ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది.
వడా పావ్ అంటే ఏమిటి?
ఇది ఒక మృదువైన బన్ (పావ్). లోపల క్రిస్పీ బంగాళాదుంప ప్యాటీ (వడ)తో తయారు చేయబడిన సరళమైన.. సువాసనగల వంటకం. స్పైసీ, టాంగీ, క్రీము సాస్‌లు రుచిని జోడిస్తాయి. వడ పావ్‌ను భారతదేశంలోని అన్ని వయసుల వారు తినే సరసమైన అల్పాహారం.
ఇది పూర్తిగా శాకాహార వంటకం. ఉడకబెట్టి.. ముద్ద చేసిన బంగాళాదుంపను పిండిలో కూరి వేయించి వడా తయారు చేస్తారు. సగానికి చీల్చిన పావ్ లోపల ఆ వేయించిన వడను పెట్టి వడాపావ్ తయారు చేస్తారు. దీనిలో నంజుకోడానికి ఒకటి రెండు రకాల పచ్చళ్ళు, పచ్చి మిరపకాయ ఇస్తారు. ఇది ముంబైలో సరసమైన స్ట్రీట్ ఫుడ్‌గా ఉద్భవించినప్పటికీ.. ఇప్పుడు భారతదేశమంతటా ఫుడ్ స్టాల్స్, రెస్టారెంట్లలో లభిస్తోంది. దీనిని బాంబే బర్గర్‌గా కూడా పిలుస్తుంటారు. ఇలాంటిది ప్రపంచ గుర్తింపు తెచ్చుకుంది.