Pithapuram: జనసేన-టీడీపీ-బీజేపీ కూటమి అభ్యర్థిగా పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దిగారు జనసేనాని పవన్ కల్యాణ్.. ఇక ఎన్నికల తరుణంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మానాభం.. పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేయడమే పనిగా పెట్టుకున్నారు.. వరుసగా సమావేశాలు, ప్రెస్‌మీట్లు నిర్వహిస్తూ.. పవన్ కల్యాణ్‌కు దమ్ముంటే.. నాపై సూటిగా మాట్లాడాలని.. ఇతర నేతలతో మాట్లాడించడం కాదని పేర్కొన్నారు. పవన్ దమ్ముంటే.. నా ప్రశ్నలపై స్పందించాలి.. నన్ను ప్రశ్నిస్తే.. నేను సమాధానాలు చెబుతానని చెప్పుకొచ్చారు. అంతేకాదు పవన్ కల్యాణ్‌ను ఓడించి తీరుతానని.. పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే.. నా పేరు పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానంటూ ఆయన చేసిన కామెంట్లు వైర్ అయ్యాయి.. అయితే, ఉన్నట్టుండి ఈ ఎపిసోడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు ముద్రగడ కూతురు క్రాంతి..
తొలి వీడియోలో తన తండ్రి ఛాలెంజ్‌ను తప్పుబట్టిన ముద్రగడ కుమార్తె బార్లపూడి క్రాంతి.. ఇప్పుడు మరో వీడియో రిలీజ్ చేశారు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేయడం మన అదృష్టంగా పేర్కొన్న ఆమె.. పార్టీ అధ్యక్షుడు పోటీ చేసే నియోజకవర్గం చాలా అభివృద్ధి చెందుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ఎటువంటి అధికారం లేకపోయినా సమస్యల పట్ల పవన్ కల్యాణ్ స్పందించారు.. అటువంటి నాయకుడు అసెంబ్లీలో ఉంటే ఎలాంటి అభివృద్ధి జరుగుతుందో ఊహించుకోండి అని సూచించారు.. పిఠాపురంలో పవన్ కల్యాణ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు ముద్రగడ పద్మనాభం కుమార్తె బార్లపూడి క్రాంతి.
కాగా, ముద్రగడ పద్మనాభంకు షాక్ ఇస్తూ తొలి వీడియో రిలీజ్ చేశారు ఆయన కూతురు క్రాంతి.. ”అందరికీ నమస్కారం.. నేను క్రాంతి. ముద్రగడ పద్మనాభం గారి అమ్మాయిని.. పిఠాపురంలో పవన్ కల్యాణ్ గారిని ఓడించేందుకు వైసీపీ నాయకులు ఎన్ని చేయాలో అన్నీ చేస్తున్నారు. అందులో భాగంగా మా నాన్న ఒక బాధాకరమైన ఛాలెంజ్ చేశారు. పవన్ కల్యాణ్ ను ఓడించి… పిఠాపురం నుంచి తన్ని తరిమేయకపోతే.. నా పేరును ముద్రగడ పద్మనాభంరెడ్డిగా మార్చుకుంటానని ప్రకటించారు.. కానీ, ఈ కాన్సెప్ట్ ఏమిటో నాకు అస్సలు అర్థం కాలేదన్నారు.. అంతే కాదు. ఆయన ప్రకటన ముద్రగడ అభిమానుకు కూడా నచ్చలేదన్నారు క్రాంతి.. వైసీపీ అభ్యర్థి వంగా గీత గెలుపుకోసం కష్టపడొచ్చు. కానీ, పవన్ కల్యాణ్, ఆయన అభిమానులను కించపరిచేలా మాట్లాడడం మంచిది కాదని హితవుపలికారు.. ఇక, కేవలం పవన్‌ని తిట్టడానికే మా నాన్నని.. వైఎస్ జగన్ వాడుతున్నారు. ఈ ఎన్నికల తర్వాత మా నాన్నను ఎటూ కాకుండా వదిలేయడం పక్కా.. అంటూ ఆ వీడియోలో పేర్కొన్నారు ముద్రగడ పద్మనాభం కూతురు క్రాంతి.
ఇక, తన కూతురు క్రాంతి చేసిన వ్యాఖ్యలపై స్పందించిన వైఎస్ఆర్సీపీ నేత, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం.. షాకింగ్ కామెంట్స్ చేశారు.. నా కూతురుకు పెళ్లి అయ్యింది.. తాను పెళ్లి కాకముందు వరకే నా ప్రాపర్టీ.. ఇప్పుడు ఆమె మెట్టినిల్లె ఆమె ప్రాపర్టీగా పేర్కొన్నారు. నన్ను నా కూతురుతో కొంతమందితో తిట్టించారని మండిపడ్డారు.. ఇది బాధాకరం అని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, రాజకీయం రాజకీయమే, కూతురు కూతురే అని చెప్పుకొచ్చారు. నేను ఒకసారి వైఎస్ఆర్సీపీలో చేరాను.. ఇక పక్క చూపులు చూడను. ఎవరెన్ని అనుకున్న సీఎం వైఎస్ జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయం అనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. నేను పదవుల కోసం పాకులాడను అని స్పష్టం చేశారు ముద్రగడ.. ఏ పదవులు కూడా అడగనన్న ఆయన.. నేను సేవకున్ని మాత్రమే అన్నారు. నా కూతురి వ్యాఖ్యలకు బాధపడిన భయపడను.. నా కూతురు.. ఇప్పుడు నా ప్రాపర్టీ కాదని పేర్కొన్నారు.. ఇక, నా కూతురు చేత వీడియో రిలీజ్ చేయించారు.. ఎవరు బెదిరించినా.. బెదిరిపోను జగన్ కి సేవకుడిగా ఉంటాను.. నా కూతురికి, నాకు మధ్య చిచ్చు పెట్టాలని చూశారు.. బెదిరిపోను అంటూ ముద్రగడ పద్మనాభం స్పష్టం చేసిన విషయం విదితమే.. మొత్తంగా ఎన్నికల వేళ.. కూతురు వీడియోలు ముద్రగడకు తలనొప్పిగా మారాయంటున్నారు..