MS Dhoni visits Deori Maa Temple in Ranchi: భారత మాజీ క్రికెట్ జట్టు కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారథి ఎంఎస్ ధోనీ మంగళవారం రాంచీలోని పవిత్ర దేవరీ మా ఆలయాన్ని సందర్శించారు. అభిమానుల మధ్య క్యూ లైన్‌లో నిల్చొని మరీ.. అమ్మవారిని మహీ సందర్శించారు. దేవరీ మా ఆలయంలోని దుర్గాదేవికి ధోనీ ప్రత్యేక పూజలు చేశారు. ఆపై అర్చకులు ఆయనకు ఆశీర్వచనాలు అందజేశారు. అభిమానులు ధోనీతో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. చెన్నై కెప్టెన్ దేవరీ మా ఆలయంను సందర్శించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
దేవరీ మా ఆలయంలో ఎంఎస్ ధోనీ ఇలా ప్రత్యేక పూజలు చేయడం ఇదే తొలిసారి కాదు. కీలక టోర్నీలు, ముఖ్యమైన పనులు చేపట్టే ముందు మహీ ఈ ఆలయాన్ని సందర్శించి దుర్గాదేవి ఆశీర్వాదం తీసుకుంటాడు. భారత జట్టులోకి ఎంపికైనప్పటి నుంచి ధోనీ ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాడు. ప్రపంచకప్ టోర్నీలు, ఐపీఎల్‌కు ముందు ఈ ఆలయాన్ని సందర్శించి.. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తాడు. ఐపీఎల్ 2024 వచ్చే నెలలో ఆరంభం కానున్న నేపథ్యంలో మహీ అమ్మవారిని సందర్శించాడు. ఇక పూర్తిస్థాయి ప్రాక్టీస్ మొదలెట్టనున్నాడు.
Also Read: IND vs ENG: భారత్ బ్యాటింగ్ బాగా మెరుగుపడాల్సి ఉంది.. మాజీ ఆటగాడు వార్నింగ్!
2020లో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ఎంఎస్ ధోనీ.. కేవలం ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నాడు. ఐపీఎల్ టోర్నీలో ఆడుతూ అభిమానులను అలరిస్తున్నాడు. ఐపీఎల్ 2023లో మోకాలి నొప్పితో తీవ్రంగా ఇబ్బంది పడిన ఎంఎస్ ధోనీ.. టోర్నీ అనంతరం శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. కోలుకున్న మహీ.. గత రెండు నెలలుగా ఫిట్‌నెస్‌పై ఫోకస్ పెట్టాడు. ఐపీఎల్ 2024 ప్రారంభం కానున్న నేపథ్యంలో ధోనీ తన బ్యాటింగ్‌పై ఫోకస్ పెట్టనున్నాడు. చెన్నై జట్టుకు ధోనీ నాలుగు ఐపీఎల్ టైటిల్స్ అందించిన విషయం తెలిసిందే.
— Dhoni (@Mahi82552044) February 6, 2024