MS Dhoni Jokes About Knee Pain When Asked on IPL 2026 Plans: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమై ఐదేళ్లు అయింది. అయినా కూడా మహీ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆడుతూ అభిమానులను అలరిస్తున్నాడు. ఐపీఎల్‌లో కేవలం రెండు నెలలు మాత్రమే ఆడే ధోనీ కోసం ఫాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తారు. అయితే గత రెండు సంవత్సరాలుగా ఇదే చివరి సీజన్ అంటూ వార్తలు వస్తున్నా.. మహీ ఆడుతూ వస్తున్నాడు. ఐపీఎల్ 2025 అనంతరం ధోనీ వీడ్కోలుపై వార్తలు వచ్చాయి. ఇటీవలి కాలంలో మహీ ఏ కార్యక్రమంకు హాజరయినా.. ఐపీఎల్ రిటైర్మెంట్‌పై ప్రశ్నలు ఎదురవుతున్నాయి.
తాజాగా ఓ ఈవెంట్‌లో ఎంఎస్ ధోనీ పాల్గొనగా ఐపీఎల్ 2026లో ఆడుతారా? అనే ప్రశ్న ఎదురైంది. ‘నేను ఐపీఎల్ 2026లో ఆడతానో లేదో ఇంకా తెలియదు. ఎప్పుడూ చెప్పే మాటే.. ఐపీఎల్‌కు ఇంకా చాలా సమయం ఉంది. డిసెంబర్ వరకు ఓ నిర్ణయం తీసుకుంటా. ముందే ఏదో ఒకటి చెప్పడం సరైంది కాదు’ అని ధోనీ తెలిపాడు. ‘మీరు తప్పకుండా ఐపీఎల్ ఆడాలి సర్’ అని ఓ ఓ అభిమాని అనగా.. ధోనీ స్పదించాడు. ‘నా మోకాలు నొప్పిగా ఉంది. మరి ఆ నొప్పిని ఎవరు భరిస్తారు?’ అని సరదాగా అన్నాడు. దాంతో అక్కడ నవ్వులు పూశాయి. అభిమానికి మహీ ఇచ్చిన సమాధానం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 44 ఏళ్ల ధోనీ ఐపీఎల్‌లో ఆడాలని ఫాన్స్ కోరుకుంటున్నారు.
ఎంఎస్ ధోనీ ఐపీఎల్‌లో 2008లో అరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకు 278 మ్యాచ్‌లు ఆడి 5439 పరుగులు చేశాడు. మహీ వ్యక్తిగత అత్యధిక స్కోర్ 84 నాటౌట్. ఇప్పటి వరకు 24 హాఫ్ సెంచరీలు చేశాడు. ఐపీఎల్‌లో ధోనీ 375 ఫోర్లు, 264 సిక్స్‌లు బాదాడు. మోకాలి నొప్పి కారణంగా గత రెండు సీజన్‌లలో మహీ సింగిల్స్ తీయకుండా.. ఎక్కువగా బౌండరీలు మాత్రమే బాదుతున్నాడు. కీపింగ్‌లో మాత్రం కుర్రాళ్లతో పోటీపడుతూ.. మెరుపు స్టంపింగ్‌లు చేశాడు. చెన్నై సూపర్ కింగ్స్‌కు మహీ ఐదు ఐపీఎల్ టైటిల్స్ అందించిన విషయం తెలిసిందే.