MP Avinash Reddy: సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఈ రోజు కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి విచారణకు హాజరుకావాల్సి ఉంది.. ఎంపీ అవినాష్ రెడ్డికి 160 సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేసిన సీబీఐ అధికారులు.. ఈ రోజు ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని సూచించారు.. అయితే, ఈరోజు విచారణకు హాజరు కాలేనంటూ సీబీఐకి విజ్ఞప్తి చేశారు వైఎస్ అవినాష్‌రెడ్డి.. షార్ట్ నోటీసుతో విచారణకు పిలిచారన్న ఆయన.. వివిధ పనుల్లో నిమగ్నమై ఉన్నానని తెలిపారు.. అత్యవసర పనులు ఉన్నాయని సీబీఐకి లేఖ రాసిన ఆయన.. 3-4 రోజుల సమయం కావాలని కోరారు.. ఈమేరకు సీబీఐ అధికారులకు లేఖ రాశారు ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి.. ఆ తర్వాత హైదరాబాద్ నుంచి కడపకు బయల్దేరారు.. అయితే, ఎంపీ అవినాష్‌రెడ్డి విజ్ఞప్తిపై ఇప్పటి వరకు సీబీఐ స్పందించలేదు..
Read Also: Union Minister Kaushal Kishore: నిరుద్యోగం లేకుండా చేయాలన్నదే ప్రధాని మోడీ లక్ష్యం
కాగా, వైఎస్ వివేకా హత్య కేసులో ముందస్తు బెయిల్ కోసం ఎంపీ అవినాష్‌రెడ్డి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.. ముందస్తు బెయిల్ ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది.. ఇక, వివేకా హత్య కేసులో 20 రోజుల తర్వాత మరోసారి సీబీఐ నోటీసులు జారీ చేయడంతో ఈ రోజు ఆయన సీబీఐ ముందుకు వస్తారని అంతా భావించారు. కానీ, ఆయన మరింత సమయం కోరడంతో.. ఈ కేసు మరింత ఆసక్తికరంగా మారింది.. మరోవైపు వైఎస్ వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఉదయ్ కుమార్ రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను సీబీఐ కోర్టు కొట్టివేసింది. ఉదయ్ కుమార్ రెడ్డి బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా సీబీఐ అధికారులు వివేకా హత్య కేసు డైరీని కోర్టుకు సమర్పించారు. కేసు విచారణ కీలక దశలో ఉందని, ఉదయ్ కుమార్ రెడ్డికి బెయిల్ ఇవ్వొద్దని సీబీఐ అధికారులు కోర్టును కోరారు. ఉదయ్ కుమార్ రెడ్డి బెయిల్ పై బయటికొస్తే సాక్షులను ప్రభావితం చేస్తాడని సీబీఐ వాదించింది. వివేకా హత్య కేసులో ఉదయ్ ప్రమేయంపై ఆధారాలు ఉన్నాయని, అందుకే అరెస్ట్ చేశామని సీబీఐ వెల్లడించింది.