ఒకప్పుడు మాజీ సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుపై గొప్పలు చెప్పుకుని.. ఇప్పుడు తప్పించుకుంటున్నారు అని బీజేపీ ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణలో వరి దాన్యం దిగుబడి పెరగలేదని, కాళేశ్వరం పేరుతో కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారన్నారు. కాళేశ్వరం మంచి అయినా, చెడు అయిన బాధ్యుడు కేసీఆర్ అని పేర్కొన్నారు. ప్రపంచంలో అతి పెద్ద ఇంజనీరింగ్ బ్లండర్ కాళేశ్వరం అని, కాళేశ్వరంలో అవినీతి జరిగినా ప్రాజెక్ట్ కూడా మిగలలేదు అని ఎద్దేవా చేశారు. తాను బీఆర్ఎస్ పార్టీని వీడేందుకు కాళేశ్వరం కూడా ఓ కారణం అని కొండ విశ్వేశ్వర్ రెడ్డి చెప్పారు.
‘కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణలో వరి దాన్యం దిగుబడి పెరగలేదు. కాళేశ్వరం పేరుతో కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ డిజైన్ అన్ని విధాలుగా తప్పు. మేడిగడ్డను బ్యారేజ్‌గా కాకుండా.. డ్యాంగా వాడుకోవడం వల్లనే దెబ్బతింది. అప్పుడు కాళేశ్వరంపై గొప్పలు చెప్పుకుని.. ఇప్పుడు కేసీఆర్ తప్పించుకుంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ స్వయం ప్రత్యక్షం అయిందా?. గవర్నర్ కేసీఆర్ గారిని కాళేశ్వర్ రావు అని పిలిచారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రతి రైతు ప్రతి ఏడాది 91 వేలు రూపాయలు లబ్ధి పొందుతున్నారు. బీజేపీ ఎంపీలు వేస్ట్ అని ఆరోపిస్తున్నారు. తెలంగాణను ఆదుకుంటుంది కేంద్రం. నవోదయ స్కూల్స్, టూరిజం నిధులు, పీఎం శ్రీ, పీఎం కుసుమ్ పథకం కింద మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే.. తెలంగాణకు ఎక్కువ నిధులు వచ్చాయి’ అని బీజేపీ ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి చెప్పారు.
‘కాళేశ్వరం మంచి అయినా, చెడు అయిన బాధ్యుడు కేసీఆర్. ప్రపంచంలో అతి పెద్ద ఇంజనీరింగ్ బ్లండర్ కాళేశ్వరం. కాళేశ్వరంలో
అవినీతి జరిగినా.. కనీసం ప్రాజెక్ట్ కూడా మిగలలేదు. మిగతా ప్రాజెక్టుల్లో అవినీతి జరిగినా.. ప్రాజెక్ట్ మాత్రం మిగిలింది. కేబినెట్ అంటే కేసీఆర్.. కేసీఆర్ అంటే కేబినెట్. కమిషన్ అడిగిన దానికి ఈటల రాజేందర్ సమాధానం చెప్పారు. కేసీఆర్ గురుంచి అడిగి ఉంటే ఈటల చెప్పే వారు. నేను బీఆర్ఎస్ పార్టీని వీడేందుకు కాళేశ్వరం కూడా ఓ కారణం’ అని ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి చెప్పుకొచ్చారు.
Also Read: TS Govt Schools: ప్రభుత్వ పాఠశాలలోనూ నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ.. ఈ విద్యా సంవత్సరం నుంచే!
కేసీఆర్ ఆహ్వానం మేరకు కొండ విశ్వేశ్వర్ రెడ్డి 2013లో రాజకీయాల్లోకి వచ్చారు . 2014 సార్వత్రిక ఎన్నికల్లో చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గం నుండి గెలిచారు. 2018లో భారత రాష్ట్ర సమితికి రాజీనామా చేసి.. కాంగ్రెస్‌లో చేరారు. 2019లో చేవెళ్ల నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. మార్చి 2021లో కాంగ్రెస్ పార్టీకి కూడా రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో చేరారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో చేవెళ్ల నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు.