తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలలోనూ ప్రీ ప్రైమరీ తరగతుల (నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ)కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖకు ఆదేశాలు జారీ చేశారు. ఈ విద్యా సంవత్సరం (2025-26) నుంచి తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలలో ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 210 ప్రభుత్వ స్కూళ్లలో ప్రీ ప్రైమరీ తరగతుల ప్రారంభానికి విద్యాశాఖ అనుమతి ఇచ్చింది. నర్సరీ, ఎల్‌కేజీ, యుకేజీ తరగతుల్లో విద్యార్థులను చేర్చుకోవాలని డీఈవోలకు ఆదేశాలు జారీ చేసింది.
ఇప్పటివరకు ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ కేవలం ప్రైవేటు పాఠశాలలకు మాత్రమే పరిమితం అయింది. ప్రైవేటు పాఠశాలలు నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ తరగతులను నడుపుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి మాత్రమే పిల్లలకు చదువుకునే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు రాష్ట్రంలోని 210 ప్రభుత్వ పాఠశాలల్లో నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ తరగతులు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Also Read: Kaleshwaram Project: రిపోర్ట్ వచ్చాక చర్యలు తప్పవు.. ఎంత పెద్దవాళ్లు ఉన్నా వదలం: పొంగులేటి
పిల్లలకు మూడేళ్లు నిండగానే ప్రీ ప్రైమరీ కోసం తల్లిదండ్రులు ప్రైవేటు పాఠశాలల్లో చేర్పించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దాంతో ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి ఎడాది విద్యార్థుల సంఖ్య తగ్గుతోందని ప్రభుత్వం భావించింది. ఈ నేపథ్యంలో ప్రీ ప్రైమరీ తరగతులను ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 18,133 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. ఈ ఏడాది మాత్రం 210 ప్రభుత్వ స్కూళ్లలో ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభం కానున్నాయి.