ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ తెలంగాణలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అయితే.. కేంద్రంలో ఉన్న బీజేపీనే కవిత అరెస్ట్‌కు కారణం అంటూ బీఆర్‌ఎస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే.. కవిత అరెస్ట్ పై రాజ్యసభ సభ్యులు డా. లక్ష్మణ్ స్పందించారు. మద్యం కుంభకోణంలో కవితను అరెస్ట్ చేశారని, గత సంవత్సర కాలంగా దర్యాప్తు సంస్థలు అనేక ఆధారాలు సేకరించి అరెస్ట్ చేశారని ఆయన తెలిపారు. ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వంలో కూడా సగం మంది మంత్రులు కూడా ఈ విజయంలో జైలుకు వెళ్లారన్నారు. కేసీఆర్ అభిమానులు, అనుచరులతో పాటు ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలు కేసీఆర్ గురించి గొప్పలు చెప్పేవారని ఆయన అన్నారు. కేసీఆర్ అపర భగీరథుడని, నదులకు నడక నేర్పాడని పోగిడేవారని ఆయన విమర్శించారు. నదులకు నడక సంగతి దేవుడెరుగు కానీ.. మద్యాన్ని మాత్రం ఢిల్లీ కి తరలించారని, మద్యం ఇతర రాష్ట్రాలకు తరలించిన చరిత్ర, ఖ్యాతి బీఆర్ఎస్ కే దక్కిందని ఆయన మండిపడ్డారు.
అంతేకాకుండా.. ‘దర్యాప్తు సంస్థలు ఆధారాలతో కవితని అరెస్ట్ చేస్తే.. దానిని రాజకీయానికి ముడి పెడుతున్నారు.. ఇందులో మాకూ మా బిజెపి ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు.. మాకు సంబంధం లేని విషయాన్ని హరీష్ రావు బిజెపి కి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు.. మీకు నిజంగానే ఆ కుంభకోణంతో సంబంధం లేకుంటే న్యాయ స్థానాలను ఆశ్రయించండి.. నిష్పక్షపాతంగా దర్యాప్తు సంస్థలు చేస్తున్న పనిని రాజకీయాలతో ముడి పెట్టడం భావ్యం కాదు.. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది.. తప్పు చేసిన వారిని వదిలే ప్రసక్తి చట్టానికి లేదు.. తప్పు చేసిన వారు ముఖ్యమంత్రి బందువులైనా, కుటుంబ సభ్యులైనా శిక్షార్హులే..’అని లక్ష్మణ్ అన్నారు.