తెలంగాణ ప్రజలకు , భారత ప్రజలకు రాహుల్ గాంధీ వెంటనే క్షమాపణ చెప్పాలంటూ బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యులు, ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. బుధవారం ఈ మేరకు ఆయన పత్రిక ప్రకటన విడుదల చేశారు. మీ పార్టీ కుటుంబ పార్టీ అని మరోసారి రుజువయ్యింది. ఇందిరాగాంధీ విగ్రహానికి నివాళులర్పించి రెండడుగుల దూరంలో ఉన్న మాజీ ప్రధాని పీవీ నర్సింహరావు విగ్రహం మొహం చూడటానికి కూడా రాహుల్ ఇష్టపడలేదు. మీది భారత్ జోడో యాత్ర కాదు భారత్ తోడో యాత్ర చార్మినార్ దగ్గరకు వెళ్లిన రాహుల్ భాగ్యలక్ష్మి అమ్మవారిని ఎందుకు దర్శించుకోలేదు. తెలంగాణలో యాత్ర ముగిసేలోపే రాహుల్ క్షమాపణ చెప్పాలి అంటూ.. తీవ్రంగా దుయ్యబట్టారు ఎంపీ లక్ష్మణ్. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ మెప్పు కోసం చేసిన నాటకమా ఇది సమాధానం చెప్పాలని, తెలంగాణ ప్రజలను , భారతదేశ ఆర్ధిక పరిస్థితిని గతిని మార్చిన నాయకుడు కాంగ్రెస్ పార్టీ ద్వారానే దేశానికి ప్రధానిగా పని చేసిన పీవీ నర్సింహారావు విగ్రహానికి ఎందుకు నివాళుర్పించలేదో వెంటనే సమాధానం చెప్పాలన్నారు.
Also Read : Jagadish Reddy : ఐటీ దాడులపై స్పందించిన మంత్రి జగదీష్ రెడ్డి..
దేశ ప్రజలకు ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు వెంటనే రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు. మీ కుటుంబానికి బానిసలుగా ఉన్న వారికి మాత్రమే విలువ ఉంటుందని మరోసారి రుజువయ్యిందని, ప్రధానిగా చేసిన పీవీ నర్సింహరావుకు ఢిల్లీలో ఘాట్ ఇవ్వకుండా అంతిమసంస్కారాలు కూడా ఢిల్లీలో చేయకుండా హైదరాబాద్ పంపించి ఆనాడు అవమానించారని, ఈనాడు పీవీ విగ్రహానికి నివాళులు అర్పించ కుండా అవమానించారని లక్ష్మణ్ గుర్తు చేశారు. కొత్త కాంగ్రెస్ అద్యక్షుడు పీవీ నర్సింహరావు తో కలిసి పనిచేసిన మల్లిఖార్జున్ ఖర్గే కూడా ఈ విషయంపై స్పందించాలని డిమాండ్ చేశారు .
చార్మినార్ దగ్గరకు వెళ్లి మాట్లాడిన రాహుల్ గాంధీ పక్కనే ఉన్న చారిత్రాత్మకమైన భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి వెళ్లకపోవడమేంటని ప్రశ్నించారు. మీరు చేస్తున్నది భారత్ జోడో యాత్రనా లేక భారత్ తోడో యాత్ర నా అని లక్ష్మణ్ దుయ్యబట్టారు. మీ నాయకత్వమే కదా భారత్‌ను మత ప్రాతిపదికన పాకిస్థాన్ గా విడగొట్టి , కశ్మీర్ ను ఆగం చేసిందని, మరోసారి దేశాన్ని విభజించే కుట్ర మీ యాత్ర ద్వారా సాగుతున్నదని మండిపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్ యాత్రకు పూర్తిగా అధికార టీఆర్ఎస్ పార్టీ మద్దతుందని తెలంగాణలో కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల జోడో యాత్ర సాగిన విషయం ప్రజలకు చాలా స్పష్టంగా అర్ధమవుతున్నది అన్నారు. రాహుల్ గాంధీ చేస్తోన్న యాత్రతో కాంగ్రెస్ పార్టీ అసలు రంగు భయటపడిందని, యాత్ర ద్వారా ప్రయాస తప్ప ప్రజల మద్దతు లభించదని ఆయన ఎద్దేవా చేశారు.