వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. వైసీపీ పార్టీ, ఎమ్మెల్సీ పదవికి మర్రి రాజశేఖర్ రాజీనామా చేశారు. మర్రి రాజశేఖర్ తన రాజీనామా లేఖను స్పీకర్‌కు పంపించారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ఇప్పటి వరకు నలుగురు ఎమ్మెల్సీలు వైసీపీని వీడారు. ఈ జాబితాలో జయమంగళ వెంకటరమణ, పోతుల సునీత, బల్లి కల్యాణ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ ఉన్నారు. తాజాగా మర్రి రాజశేఖర్ రాజీనామాతో వైసీపీకి భారీ షాక్ తగిలింది.
వైసీపీ ఆవిర్భావం నుంచి మర్రి రాజశేఖర్ పార్టీలో ఉన్నారు. 2014లో చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి.. టీడీపీ అభ్యర్థి పత్తిపాటి పుల్లారావుపై ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో చిలకలూరిపేట నుంచి విడుదల రజని వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. విడుదల రజనికి టికెట్ ఇవ్వడంతో అసంతృప్తిగా ఉన్న మర్రి రాజశేఖర్‌కు ఎమ్మెల్సీ ఇస్తానని వైసీపీ అధినేత వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. మాట ఇచ్చిన ప్రకారం ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు.
మాజీ మంత్రి విడుదల రజినికి ఇటీవల చిలకలూరిపేట వైసీపీ ఇన్చార్జి బాధ్యతలను అధినేత వైఎస్ జగన్ అప్పగించారు. తన సొంత నియోజకవర్గంలో మరలా రజినిని తీసుకురావడంపై మర్రి రాజశేఖర్ తీవ్ర అసంతృప్తి చెందినట్లు తెలుస్తోంది. మర్రి పార్టీని వీడి వెళ్తారని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. చివరకు అదే నిజమైంది. నేడు వైసీపీ పార్టీకి రాజీనామా చేశారు. మర్రి రాజశేఖర్ టీడీపీలో చేరతారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.