MLC Kavitha Press Meet Today after Suspended from BRS: భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. మంగళవారం తన కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. పార్టీకి నష్టం కలిగించే రీతిలో కవిత వ్యవహరిస్తున్నందున కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీఆర్ఎస్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఎమ్మెల్సీ కవితను సస్పెండ్ చేస్తూ గులాబీ బాస్ తీసుకున్న నిర్ణయాన్ని బీఆర్ఎస్ నేతలు స్వాగతించారు. బీఆర్ఎస్ సస్పెన్షన్ కవితకు పెద్ద షాక్ అనే చెప్పాలి.
తన భవిష్యత్ కార్యాచరణపై కీలక అంశాలను ఎమ్మెల్సీ కవిత ఈరోజు వెల్లడించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు తెలంగాణ జాగృతి కార్యాలయంలో కవిత ప్రెస్‌మీట్ నిర్వహించనున్నారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి ఆమె రాజీనామా చేయనున్నారు. రాజీనామా లేఖలను తన అనుచరుల ద్వారా తెలంగాణ భవన్, కౌన్సిల్ చైర్మన్‌కు పంపనున్నారు. కొత్త పార్టీపై ఇప్పటికిప్పుడు నిర్ణయం ఉండదు అని కవిత అనుచరులు అంటున్నారు. అయితే రాజీనామాల తర్వాత పార్టీ నేతలపై ఎలాంటి విమర్శలు చేస్తారో అని బీఆర్ఎస్‌లో ఉత్కంఠ నెలకొంది. ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, బీఆర్ఎస్ నేతలపై ఏ వ్యాఖ్యలు చేస్తారో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Also Read: Irfan Pathan: హుక్కా తాగే వాళ్లకే జట్టులో చోటు.. ఎంఎస్ ధోనీపై ఇర్ఫాన్ పఠాన్ సంచలన వ్యాఖ్యలు!
కల్వకుంట్ల కవిత 2014లో తొలిసారి నిజామాబాద్ నుంచి ఎంపీగా గెలుపొందారు. ఆపై 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయారు. అయితే నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా బీఆర్ఎస్ పార్టీ అవకాశం ఇచ్చింది. ఎమ్మెల్సీగా గెలుపొందిన కవిత.. శాసనమండలిలో అడుగుపెట్టారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి అనంతరం.. కవిత ఢిల్లీ మద్యం కేసులో అరెస్టయ్యారు. బెయిలుపై విడుదలైన కవిత.. కొంత కాలం బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. బీసీ నినాదంతో ప్రజల్లోకి వెళ్లి.. మొదటిసారిగా పార్టీకి వ్యతిరేకంగా గళం విప్పారు. ఇక బీఆర్ఎస్ రజతోత్సవ సభ అనంతరం తండ్రి కేసీఆర్‌ను ఉద్దేశించి రాసిన లేఖతో అసలు రచ్చ మొదలైంది. బీఆర్ఎస్‌ను బీజేపీలో విలీనం చేస్తున్నారనే వ్యాఖ్యలు.. సీనియర్ నేత జగదీశ్‌రెడ్డిని టార్గెట్ చేయడం.. కేసీఆర్ చుట్టూ దెయ్యాలున్నాయని, పార్టీలో కోవర్టులున్నారనే వ్యాఖ్యలతో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవాధ్యక్ష పదవి పోయింది. ఇక కాళేశ్వరం అవినీతిలో హరీశ్‌రావు, సంతోష్ రావుల పాత్ర ఉందంటూ చేసిన వ్యాఖ్యలు పార్టీలో అలజడి సృష్టించాయి. చర్చల అనంతరం కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.