MLC Kavitha :తెలంగాణ రాష్ట్ర బీసీల హక్కులకు అన్యాయం జరుగుతోందని ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలకు ఇచ్చిన హామీలను విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. బీసీల హక్కుల కోసం తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జనవరి 3న నిర్వహించనున్న బీసీ మహాసభ పోస్టర్‌ను కవిత బుధవారం ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, “సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా బీసీలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోయారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్ల పెంపు విషయంలో ప్రభుత్వం ఆలస్యం చేస్తోంది. కామారెడ్డి డిక్లరేషన్‌లో పేర్కొన్న హామీలను వెంటనే అమలు చేయాలి,” అన్నారు. సావిత్రీబాయి పూలే జయంతి సందర్భంగా బీసీ మహాసభను భారీ స్థాయిలో నిర్వహించేందుకు తెలంగాణ జాగృతి సిద్ధమవుతోందని కవిత తెలిపారు. ఈ మహాసభలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు, కామారెడ్డి డిక్లరేషన్‌ను అమలులోకి తీసుకురావాలన్న డిమాండ్లు ప్రధానంగా ఉండనున్నాయి.
ఈ మహాసభకు తెలంగాణ సర్పంచ్‌ల సంఘం జేఏసీ, విద్యార్థి జేఏసీతో పాటు పలు ప్రజా సంఘాలు, కుల సంఘాలు మద్దతు ప్రకటించినట్లు కవిత వివరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ల సంఘం జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్, బీసీ నాయకులు బొల్లా శివశంకర్, పెంట రాజేష్, సుంకోజు కృష్ణమాచారి, ఆలకుంట్ల హరి తదితరులు పాల్గొన్నారు. బీసీ మహాసభ విజయవంతం చేయడానికి పెద్ద సంఖ్యలో ప్రజలు, బీసీ నాయకులు పాల్గొనాలని కవిత పిలుపునిచ్చారు. “తెలంగాణ బీసీల హక్కుల కోసం ప్రతి ఒక్కరూ తమ మద్దతు తెలియజేయాలి,” అని ఆమె అన్నారు.