అవినీతిపై బహిరంగ చర్చలో విజయం తనదే అని అనపర్తి ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణరెడ్డి అన్నారు. తన ఐదేళ్ల పాలనలో అభివృద్ధి తప్ప.. అవినీతి లేదన్నారు. చర్చకు వస్తానని చెప్పి టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తోక ముడిచారని సూర్యనారాయణరెడ్డి విమర్శించారు. ఎన్నికల నేపథ్యంలో తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణరెడ్డి అవినీతిపరుడు అంటూ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కరపత్రాలు పంచారు. నువ్వు నిరూపించూ అంటూ ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి సవాల్ విసిరారు.
అనపర్తి ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ.. ‘అవినీతిపై బహిరంగ చర్చలో విజయం నాదే. చర్చకు వస్తానని చెప్పి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తోక ముడిచారు. అసత్య ఆరోపణలు చేయడం రామకృష్ణారెడ్డికి పరిపాటి అయింది. రానున్న ఎన్నికల్లో ప్రజాక్షేత్రంలో నా నిజాయితీ నిరూపించుకుంటా. వైసీపీని గెలిపించుకుని సీఎం జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రి చేయటమే మా ధ్యేయం. నా ఐదేళ్ల పాలనలో అభివృద్ధి తప్ప అవినీతి లేదు. అవినీతి రుజువు చేస్తే రాజకీయాల నుంచి నిష్క్రమించడానికి సిద్ధం’ అని అన్నారు.
Also Read: YS Jagan: పేదలకు మంచి చేయటం కోసం యుద్ధం చేయాల్సి వస్తోంది: సీఎం జగన్
అనపర్తిలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, వైసీపీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణరెడ్డిల మధ్య సవాళ్ళు, ప్రతి సవాళ్ళు చోటు చేసుకున్నాయి. సూర్యనారాయణరెడ్డి అవినీతిపై బహిరంగ లేఖతో ఫిబ్రవరి 19న ఎమ్మెల్యే ఆసుపత్రికి వెళ్లిన మాజీ ఎమ్మెల్యే.. అక్కడ సిబ్బందికి స్వయంగా అందచేశారు. అవినీతిపై బహిరంగ చర్చకు ఎమ్మెల్యే రావాలని సవాల్చేశారు. అయితే రామకృష్ణారెడ్డి తన ఆసుపత్రికి వెళ్ళటంపై సూర్యనారాయణరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఉన్నప్పుడు ఇంటికి వస్తే సంగతి తేల్చుతానంటూ ప్రతి సవాల్ చేశారు. ఎమ్మెల్యే సవాల్‌పై మాజీ ఎమ్మెల్యే స్పందించారు. మార్చి 1న ఉదయం 11 గంటలకు ఎమ్మెల్యే ఇంటికి వస్తానని ప్రతి సవాల్ చేశారు.