Jagananna Vidya Deevena Funds Released: శుక్రవారం కృష్ణా జిల్లా పామర్రులో రూ.708.68 కోట్ల ‘జగనన్న విద్యా దీవెన’ నిధులను ముఖ్యమంత్రి వైస్ జగన్ మోహన్ రెడ్డి విడుదల చేశారు. సీఎం జగన్ బటన్ నొక్కి పిల్లలు, తల్లుల జాయింట్ ఖాతాల్లోకి నిధులు విడుదల చేశారు. రాష్ట్రంలో ఉన్నత విద్య అభ్యసిస్తున్న 9.44 లక్షల మంది విద్యార్థులకు 2023 అక్టోబరు-డిసెంబరు త్రైమాసికానికి సంబంధించిన నిధులను బ్యాంకు ఖాతాలకు జమ చేస్తారు. విద్యా దీవెన, వసతి దీవెన పథకాలకు ఇప్పటివరకూ రూ.18,002 కోట్లను వ్యయం చేసిందని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. పేద విద్యార్థులకు ఉన్నత చదువులు భారంగా మారకూడదనే ఉధ్దేశంతో ఫీజు రియింబర్స్‌మెంట్ పథకాలను అందిస్తున్నారు.
‘జగనన్న విద్యా దీవెన’ నిధుల విడుదల సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ… ‘పెద్ద చదువులు చదువుతున్న పేదల పిల్లల ఫీజు మొత్తం ప్రభుత్వం కడుతోంది. 93 శాతం మంది పిల్లలకు జగనన్న విద్యా దీవెన ద్వారా మంచి జరుగుతోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హతా ప్రమాణాలు పెంచాము. ఎక్కువ మందికి లబ్ది చేకూర్చటం ద్వారా వీలైనంత ఎక్కువ మంది పేద పిల్లలకు లబ్ది చేస్తున్నాం. ఇపుడు 708 కోట్లు నేరుగా లబ్ది దారులకు పంపాము. ఏ పేదవాడు కూడా చదువుల కోసం అప్పులపాలు కాకూడదని మేం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని కులాల వారిని స్కీమ్‌కు అర్హులుగా చేసేందుకు ఆదాయ పరిమితిని 2 లక్షల దాకా పెంచాం. దీంతో లబ్ధిదారుల సంఖ్య పెరిగి 93 శాతం మందికి జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన ద్వారా మంచి చేయగలుగుతున్నాం’ అని అన్నారు.
Also Read: Odela 2: తమన్నా నుంచి ఇలాంటిది ఊహించలేదే.. అలాంటి పాత్రలో అంటే..
‘పేదలకు మంచి చేయటం కోసం యుద్ధం చేయాల్సి వస్తోంది. ఇంగ్లీష్ మీడియం పేదలకు పెట్టడం కోసం యెల్లో మీడియా, చంద్రబాబు, దత్త పుత్రుడుతో యుద్ధం చేశాను. పెత్తందారీ మనస్తత్వాలు గుర్తించాలి. విమర్శలు చేసే వాళ్ళ పిల్లలు మాత్రం ఇంగ్లీష్ మీడియంలో చదవాలి. పెత్తం దారులకు బడులు వేరు, చదువులు వేరు అన్నట్టు ఉంది. విద్యా రంగంలో కూడా క్లాస్ వార్ జరుగుతోంది. పిల్లలకు ట్యాబ్ లు ఇస్తే తప్పంటు ప్రచారం చేస్తున్నారు. విద్యా రంగంలో ఈ విప్లవం చేయకపోతే.. వాళ్ళు పేదలుగానే మిగిలి పోతారు’ అని సీఎం పేర్కొన్నారు.