Minister Thummala Nageswara Rao: బీఆర్ఎస్ నేతలు లేఖలతో కొత్త నాటకాలకు తెర తీస్తున్నారని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత పది సంవత్సరాలలో ఎన్నడూ లేని విధంగా రైతు సంక్షేమానికి ప్రత్యక్షంగా బడ్జెట్‌లో 35 శాతం ప్రకటించి ఖర్చు చేసినందుకా ఈ ప్రభుత్వాన్ని మీరు నిలదీయమనేదంటూ బీఆర్‌ఎస్ నేతలను ప్రశ్నించారు. రైతుబంధు పథకంలో 2019-20 సంవత్సరంలో రెండు పంటకాలాలలో మీరు పూర్తిగా డబ్బులు చెల్లించని మాట వాస్తవం కాదా అంటూ ప్రశ్నలు గుప్పించారు. 2023 యాసంగి రైతుబంధు 7600 కోట్లు ఎగ్గొట్టిన మాట వాస్తవం కాదా అంటూ మంత్రి తుమ్మల పేర్కొన్నారు.
Read Also: Sritej: శ్రీ తేజ హెల్త్ బులిటెన్ విడుదల.. మళ్ళీ పెరుగుతున్న ఫీవర్
రైతుబంధు పేరు చెప్పి అన్ని పథకాలకు వ్యవసాయ యాంత్రీకరణ, పంటల బీమా, డ్రిప్ ఇరిగేషన్ వంటి మరెన్నో పథకాలను అటకెక్కించారని మంత్రి మండిపడ్డారు. రాష్ట్ర వాటా విడుదల చేయకుండా కేంద్ర ప్రభుత్వ పథకాలైన రాష్ట్ర కృషి వికాస్ యోజన, జాతీయ ఆహార భద్రత మిషన్, నిధులు కూడా దాదాపు రూ.3005 కోట్లు రాకుండా చేసి తెలంగాణ రైతుల సంక్షోబానికి కారణమైన వారే.. ప్రభుత్వాన్ని నిలదీయమని చెప్తున్నారని ఆక్షేపించారు. పచ్చిరొట్ట విత్తనాల సబ్సిడీ కూడా చెల్లించక చేతులెత్తేస్తే, ఈ ప్రభుత్వం గత బకాయిలు చెల్లించి, వాటి సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకున్న ఈ ప్రభుత్వానికా మీరు నిలదీయమని చెప్పేదంటూ ప్రశ్నలు గుప్పించారు. మీరు చేసిన రుణమాఫీ 2014, 2018పై రైతుల వద్దకు వెళ్ళి అడగగలరా?.. అసలు ఆ పథకాలు రుణమాఫీ అని పెట్టడం కంటే వడ్డీ మాఫీ అంటే బాగుండేదేమో అంటూ ఎద్దేవా చేశారు. 2018 రుణమాఫీలో 20 లక్షల మందికి రుణమాఫీ ఎగ్గొట్టిన మాట వాస్తవం కాదా అంటూ ప్రశ్నించారు.
Read Also: Shikha Goyal: సైబర్ సెక్యూరిటీ బ్యూరో 2024 వార్షిక నివేదిక విడుదల
వారి పదవి కాలంలో పంట నష్టం సంభవించినపుడు నష్ట పరిహారం సంగతి అటుంచి, కనీసం రైతులను పరామర్శించని వారు ఇప్పుడు ప్రభుత్వాన్ని వేలెత్తి చూపిస్తున్నారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన పది నెలలలోనే రెండు విడతలు, నెల రోజుల్లోనే పంట నష్ట పరిహారం చెల్లించిన ఈ ప్రభుత్వాన్నా మీరు వేలెత్తి చూపెట్టేదంటూ అడిగారు. పంట నష్టపరిహారం కోసం రైతులు హైకోర్టు గడప ఎక్కించాల్సిన పరిస్థితి సృష్టించింది మీరు కాదా అంటూ బీఆర్‌ఎస్ నేతలను ఉద్దేశించి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎద్దేవా చేశారు.