అకాల వర్షాలు, వడగళ్లతో పంటలు దెబ్బతినే ప్రమాదం నెలకొన్న నేపథ్యంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. పంటలకు జరిగిన నష్టాన్ని త్వరితగతిన అంచనా వేసి, ప్రాథమిక నివేదికను వెంటనే అందించాలని సంబంధిత శాఖ అధికారులకు సూచించారు. మార్కెట్లకు చేరుకున్న పంట ఉత్పత్తులను జాగ్రత్తగా కాపాడాలని మంత్రి తెలిపారు. వర్షం కారణంగా పంట నష్టపోవకుండా తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని మార్కెటింగ్ శాఖ అధికారులకు సూచనలు జారీ చేశారు. అలాగే, ఇప్పటికే కొనుగోలు చేసిన ఉత్పత్తులను వర్షానికి లోనుకాకుండా వెంటనే గోడౌన్లకు తరలించాలని మార్క్‌ఫెడ్ అధికారులను ఆదేశించారు. రైతులకు నష్టం కలగకుండా, ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని మంత్రి తుమ్మల హామీ ఇచ్చారు.
READ MORE: Sexual Harassment: 10 రోజులుగా ప్రాణాలతో పోరాడి.. మెడికల్ విద్యార్థిని నాగాంజలి మృతి!
ఇదిలా ఉండగా.. హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈదురుగాలులు, వడగండ్ల వానలు పడుతున్నందున జిల్లాల కలెక్టర్లు, పోలీసులు అన్ని శాఖల అధికారులను అప్రమత్తం చేయాలని సూచించారు. వర్షాలు, సహాయక చర్యలపై ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షించాలని సీఎస్ శాంతికుమారిని ఆదేశించారు. హైదరాబాద్‌లో లోతట్టు ప్రాంతాలు జలమయమైన నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందుల్లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. రోడ్లపై నీరు నిల్వకుండా ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడంతో పాటు, విద్యుత్తు అంతరాయాలు లేకుండా జీహెచ్‌ఎంసీ, పోలీస్, హైడ్రా విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.