లైంగిక వేధింపులు తాళలేక రాజమండ్రి కిమ్స్ హాస్పిటల్‌లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మెడికల్ విద్యార్థి నాగాంజలి మృతి చెందింది. పది రోజులుగా ప్రాణాలతో పోరాడి.. రాత్రి రెండు గంటల సమయంలో కన్నుమూసింది. నాగాంజలి మృతి చెందినట్లు రాజమండ్రి ప్రభుత్వాసుపత్రి వైద్యులు ధ్రువీకరించారు. రాజమండ్రి ప్రభుత్వాసుపత్రి వద్దకు వైద్య బృందం చేరుకుంది. ఈ నేపథ్యంలో ఎటువంటి అల్లర్లు జరగకుండా కిమ్స్ హాస్పిటల్ వద్ద భారీ బందోబస్తును పోలీసులు ఏర్పాటు చేశారు.
Also Read: Pregnant Woman: ఆస్పత్రికి డెలివరీకి వెళ్లిన గర్భిణి అదృశ్యం.. చివరకు?
మెడికల్ విద్యార్థిని నాగాంజలి మృతదేహాన్ని కిమ్స్ హాస్పిటల్ నుండి రాజమండ్రి ప్రభుత్వాసుపత్రి తరలించారు. రాజమండ్రి ప్రభుత్వాసుపత్రిలో మరికొద్ది సేపట్లో నాగాంజలి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించనున్నారు. పోస్టుమార్టం అనంతరం నాగాంజలి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు వైద్యులు అప్పగించనున్నారు. విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు భారీ ఎత్తున ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. ప్రస్తుతం రాజమండ్రి ప్రభుత్వాసుపత్రి వద్ద భారీగా పోలీసులు మొహరించారు.
కిమ్స్ హాస్పిటల్ ఏజీఎం దీపక్ లైంగిక వేధింపులు తాళలేక గత నెల 23న అధిక డోసేజ్ మత్తు ఇంజక్షన్ తీసుకున్న నాగాంజలి.. వైద్య సేవలు పొందుతూ కన్నుమూశారు. సూసైడ్ లెటర్ ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ దారుణం ఘటనలో నిందితుడు దీపక్ ను గత నెల 29వ తేదీన పోలీసులు అరెస్టు చేశారు. మెడికల్ విద్యార్థిని మరణ వార్తను తెలుసుకున్న విద్యార్థులు, రాజకీయ పార్టీలు నేతలు.. నాగాంజలి తల్లిదండ్రులను పరామర్శించి న్యాయం జరిగే వరకూ అండగా ఉంటామని భరోసా ఇస్తున్నారు.