సింగరేణి కార్మికులకు రూ. 20 లక్షల వడ్డీలేని రుణాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. సింగరేణి కార్మికులను తాను ఆదుకుంటానని, కార్మికుల న్యాయమైన డిమాండ్ల కోసం కృషి చేస్తానన్నారు. గడిచిన పది సంవత్సరాలు నామవాత్ర ఉద్యోగాలు నియమించారని, కాంగ్రెస్ ప్రభుత్వం రెండు లక్షల ఉద్యోగాలను చేపట్టే కార్యక్రమం ప్రారంభించిందని పొంగులేటి చెప్పారు. ఇన్‌కమ్ ట్యాక్స్ మినహాయింపు కార్యక్రమాన్ని తమ ప్రభుత్వం తీసుకోబోతుందని చెప్పుకొచ్చారు. ఇల్లందు సింగరేణి జెకే ఓపెన్ కాస్ట్ ఆఫీస్ వద్ద ఐఎన్టీయూసీ విజయాన్ని కాంక్షిస్తూ నిర్వహించిన మీటింగ్‌లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.
మీటింగ్‌లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ… ‘క్రిస్మస్ సోదరులకు శుభాకాంక్షలు. అసెంబ్లీ ఎన్నికల్లో కోరం కనకయ్యను అధిక మెజార్టీతో గెలిపించిన ఓటర్లకి అభినందనలు. సింగరేణి ప్రాంతంలో ఉన్న కార్మిక సోదరులందరూ ఐఎన్టీయూసీని ఆదరించాలి. సింగరేణి ఎన్నికలను ఓటమి భయంతో బీఆర్ఎస్ ప్రభుత్వం వాయిదా వేస్తూ వస్తుంది. కార్మికుల గుండెల్లో కాంగ్రెస్ పార్టీ ఉంది. కార్మికుల గుండెల్లో ఇందిరమ్మ రాజ్యం ఉంది. అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించారు. ప్రజలు కోరుకున్నట్లుగానే ఇందిరమ్మ రాజ్యం వచ్చింది. ఇంద్రమ్మ రాజ్యంలో మాటిస్తే తప్పదనే నమ్మకంతో కాంగ్రెస్ పార్టీని గెలిపించారు’ అని అన్నారు.
Also Read: Dogs Attack: వీధి కుక్కల దాడి.. 5 నెలల చిన్నారి మృతి!
‘సింగరేణిలో టీబీజీకేఎస్ మాయమాటలు చెప్పి రెండు పర్యాయాలు గెలిచింది. బీఆర్ఎస్ పార్టీలో ఉండి.. మోసపోయి గోసపడి ఈరోజు విముక్తయ్యాను. ఈరోజు రాష్ట్ర క్యాబినెట్లో ప్రధాన స్థానంలో ఉన్నా. కార్మికులను ఆదుకుంటా. కార్మికుల న్యాయమైన డిమాండ్ల కోసం కృషి చేస్తా. ఐదు సంవత్సరాల కాలంలో 15 వేల మంది ఉద్యోగాలకు తగ్గింపు జరిగింది. గడిచిన పది సంవత్సరాలు నామవాత్ర ఉద్యోగాలు నియమించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రెండు లక్షల ఉద్యోగాలను చేపట్టే కార్యక్రమం ప్రారంభించింది. జీకేఓసి ఎక్స్‌టెన్షన్ చేస్తాం. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం నా మాట వినలేదు. అందుకే కార్మికుల హక్కులు పరిష్కారం కాలేదు. కార్మికులకు 20 లక్షల వడ్డీలేని రుణాన్ని ఇప్పిస్తాం. కార్మికుల ఉద్యోగాలను రక్షణ కల్పించే బాధ్యత నేను తీసుకుంటా. ఇన్‌కమ్ ట్యాక్స్ మినహాయింపు కార్యక్రమాన్ని మన ప్రభుత్వం తీసుకోబోతుంది. రాబోయే 20 సంవత్సరాల వరకు ఇంద్రమ్మ రాజ్యమే ఉంటుంది. మీ అమూల్యమైన ఓటు ఐఎన్టీయూసీకి కాకుండా.. ఇతర సంఘాలకు వేస్తే మీ ఓటు మురిగిపోయినట్లే. గత ప్రభుత్వంలో కారుణ్య నియామకాలు న్యాయంగా జరగలేదు. కారుణ్య నియామకాల కోసం ఉద్యోగానికి నాలుగు లక్షలు చేతులు మారాయి. కారుణ్య నియామకాల కోసం ఖర్చు పెట్టుకుండా ఇప్పించే బాధ్యత నాది’ అని పొంగులేటి హామీ ఇచ్చారు.