Minister Ponguleti Srinivas Reddy: వరంగల్ జిల్లా కేంద్రంలోని కాకతీయ యూనివర్సిటీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు వరంగల్ జిల్లా ఇంఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్రం ఏర్పడి పదేళ్లు దాటినా గత ప్రభుత్వం కాకతీయ యూనివర్సిటీ కాంపౌండ్ నిర్మించలేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు.
Read Also: CM Revanth Reddy: నేడు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో సీఎం రేవంత్ సమావేశం
ఇప్పుడు కాంపౌండ్ వాల్‌కు శంకుస్థాపన చేశామన్నారు. మా ప్రభుత్వం విద్యా, వైద్యరంగానికి పెద్దపీట వేస్తోందన్నారు. రేపు ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమం ప్రారంభం కాబోతోందని మంత్రి తెలిపారు. ప్రభుత్వం ఏర్పడిన 75రోజుల్లోనే 31వేల ఉద్యోగాలు ఇచ్చామన్నారు. ఏడాదిలోనే 2లక్షల ఉద్యోగాలిస్తామని మంత్రి పొంగులేటి వెల్లడించారు. టీఎస్‌పీఎస్సీని పునరుద్ధరించి ఉద్యోగ నోటీఫికేషన్లు ఇస్తున్నామన్నారు. కాకతీయ యూనివర్సిటీ కాంట్రాక్టు అధ్యాపకుల రెగ్యులరైజేషన్ అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత వర్సిటీలో అడుగుపెట్టిన మంత్రులం మేమేనని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.