వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణానికి 96లో సీఎం చంద్రబాబు భూమి పూజ చేశారని, 30 ఏళ్లుగా ప్రాజెక్టు నిర్మాణం జరగడంపై ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నారని ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. ప్రతి 15 రోజులకి ఒక సారి సీఎం చంద్రబాబు ప్రాజెక్టు నిర్మాణంపై రివ్యూ చేస్తున్నారని, 2026 కల్లా వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేస్తాం అని చెప్పారు. పూర్తి కాని వెలిగొండ ప్రాజెక్టును వైఎస్ జగన్ జాతికి అంకితం అంటూ ప్రకాశం జిల్లా ప్రజల్ని మోసం చేశారని విమర్శించారు. ఆయకట్టు రైతులకు నీరందించే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పని చేస్తోందని నిమ్మల చెప్పుకొచ్చారు.
మొంథా తుఫాన్ కారణంగా దెబ్బతిన్న వెలిగొండ ఫీడర్ కెనాల్‌ను ఇరిగేషన్ నిపుణుల బృందంతో కలిసి మంత్రి నిమ్మల ఈరోజు పరిశీలించారు. ప్రాజెక్టు పెండింగ్ పనులపై అధికారులు, ఏజెన్సీల ప్రతినిధులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. జంట సొరంగాల్లోకి వచ్చిన నీటిని తొలగించే పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. భవిష్యత్తులో వచ్చే వరదలను దృష్టిలో పెట్టుకుని.. ఫీడర్ కెనాల్ సీసీ వాల్ లైనింగ్ నిర్మాణం డిజైన్స్ అప్రూవల్ చేయాలని సూచించారు. ఫీడర్ కెనాల్ లైనింగ్, 3 కి.మీ పొడవున రిటైనింగ్ వాల్ నిర్మాణ పనుల కోసం రూ.456 కోట్లతో టెండర్లు పిలిచాం అని, ఈ నెలలో ఫీడర్ కెనాల్ పనులు మొదలుపెట్టబోతున్నాం అని మంత్రి నిమ్మల తెలిపారు.
‘వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణానికి 96లో సీఎం చంద్రబాబు భూమి పూజ చేశారు. 30 ఏళ్ళుగా వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం జరగడంపై చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి 15 రోజులకి ఒక సారి చంద్రబాబు ప్రాజెక్టు నిర్మాణంపై రివ్యూ చేస్తున్నారు. 2026 కల్లా వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేస్తాం. వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేసేందుకు పగలు, రాత్రి పనులు జరుగుతున్నాయి. వెలిగొండ నిర్మాణం పూర్తి కాకుండానే గత ప్రభుత్వంలో వైఎస్ జగన్ ప్రారంభించారు. తల్లినీ, చెల్లిని మోసం చేసిన ఆయనకి ప్రకాశం జిల్లా ప్రజల్ని మోసం చెయ్యడం లెక్కకాదు. జగన్ చర్యలు హాస్యాస్పదం. జగన్ మానసిక పరిస్థితి విచిత్రంగా ఉంది. జగన్ ప్రభుత్వంలో నిర్వాసితులకు ఒక్కరూపాయి కూడా ఇవ్వలేదు. హంద్రీనివా రాయలసీమకి జీవనాడి. 2025లోనే హంద్రీనివా ప్రాజెక్టు పూర్తి చేశాం’ అని మంత్రి నిమ్మల గుర్తు చేశారు.