Minister Narayana: రాష్ట్రంలోని పట్టణాలను అందంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రణాళికను రూపొందించిందని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు నగరంలోని వరద ప్రభావిత ప్రాంతాలతో పాటు వివిధ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సెంటర్ డివైడర్లలో ఫ్లెక్సీలు, పోస్టర్లు ఏర్పాటు చేయకుండా నిషేధాన్ని విధిస్తున్నామన్నారు. దీనికి సంబంధించి కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే చట్టాన్ని చేశాయని.. మన రాష్ట్రంలో కూడా త్వరలోనే చట్టాన్ని తీసుకువస్తామన్నారు.
Read Also: Andhra Pradesh: మందుబాబులకు గుడ్‌న్యూస్.. అందుబాటులోకి రూ.99 క్వార్టర్ మద్యం బాటిల్!
అదేవిధంగా పట్టణాల్లోని గోడలకు పోస్టర్లు అంటిస్తే వాటిని వెంటనే తొలగిస్తామన్నారు. ప్రచారాలు చేసుకునేందుకు సోషల్ మీడియా ఉందని.. దానిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం వల్లే భారీ వర్షాలు కురిసినా.. ప్రజలకు ఇబ్బందులు కలగలేదన్నారు. పట్టణాల్లోని కాలువలలో పూడికను తొలగించడంతోపాటు వర్షపు నీరు వెళ్ళేలా ఎప్పటికప్పుడు అవసరమైన చర్యలు తీసుకున్నామని మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలో ఇసుక కొరతను నివారించేందుకు మరిన్ని రీచ్‌లను అందుబాటులోకి తీసుకువస్తామన్నారు.