ఏపీ మంత్రి నారా లోకేష్ విద్యార్థులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. నిన్న విజయవాడలోని సింగ్ నగర్‌లో ఉన్న ప్రభుత్వ జూనియర్ కాలేజీలో మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించిన మంత్రి.. విద్యార్థినులతో ముఖాముఖి నిర్వహించారు. స్థానిక విద్యార్థినులు తమకు ఆకతాయిలతో ఇబ్బందిగా ఉందని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని మంత్రిని కోరారు. దీంతో నారా లోకేష్ వెంటనే స్పందించి.. గంటల వ్యవధిలో అక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయిస్తున్నారు. ఇప్పటికే మూడు కెమెరాలు ఏర్పాటు అవ్వగా.. మిగతా రెండు కెమెరాలు కూడా మధ్యాహ్నం కల్లా ఏర్పాటు కానున్నాయి. మంత్రి లోకేష్ వెంటనే స్పందించిన తీరు పట్ల విద్యార్డినులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ముఖాముఖి సందర్భంగా ఓ విద్యార్థి మంత్రి నారా లోకేశ్‌ను ముఖ్యమంత్రి అని సంబోధించగా.. తాను మంత్రినని, ముఖ్యమంత్రిని కాదన్నారు. ‘నేను మంత్రిని రా స్వామి, నా ఉన్న ఉద్యోగం తీయించేలా ఉన్నావు’ అంటూ విద్యార్థితో లోకేశ్‌సరదాగా అన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇక విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నామని లోకేశ్ చెప్పారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను రాజకీయాలకు దూరంగా ఉంచుతామన్నారు. రాష్ట్రంలో 475 ప్రభుత్వ కళాశాలల్లో 1.48 లక్షల మంది ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం ఆరంభించారు. ఇందుకోసం ఈ విద్యా సంవత్సరంలో రూ.27.39 కోట్లు, వచ్చే ఏడాది రూ.85.84 కోట్లను ఖర్చు చేయనున్నారు.