తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీని మంజూరు చేయడంలో విఫలమైన కేంద్ర ప్రభుత్వంపై పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 16 కొత్త మెడికల్ కాలేజీలను మంజూరు చేయడం ద్వారా ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు రాష్ట్రంలో వైద్య విద్యలో చరిత్రను లిఖించారని, మరో 13 కాలేజీలను ఏర్పాటుకు ప్రతిపాదనలు ప్రారంభమయ్యాయని అన్నారు మంత్రి కేటీఆర్. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజీని నెలకొల్పాలని తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. కేటీఆర్ ఆదివారం ట్వీట్ చేస్తూ “ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు గారు వైద్య విద్యలో చరిత్రను సృష్టిస్తున్నారు. 2014కు ముందు 67 ఏళ్లలో తెలంగాణలో కేవలం ఐదు ప్రభుత్వ వైద్య కళాశాలలు మాత్రమే ఏర్పాటయ్యాయి. గత ఎనిమిదేళ్లలో, 16 కొత్త మెడికల్ కాలేజీలు మంజూరు చేయబడ్డాయి మరియు జిల్లాకు ఒక మెడికల్ కాలేజీగా మరో 13 ఏర్పాటు చేయనున్నారు.
సంగారెడ్డి, మహబూబాబాద్, నాగర్ కర్నూల్, వనపర్తి, రామగుండెం, జగిత్యాలలో దాదాపుగా పూర్తయిన మెడికల్ కాలేజీల చిత్రాలను పంచుకుంటూ, కొత్తగూడెంలో మెడికల్ కాలేజీని త్వరలో ప్రారంభించనున్నట్లు మంత్రి ట్వీట్ చేశారు. సూర్యాపేట, మహబూబ్నగర్, సిద్దిపేట, నల్గొండలో కళాశాలలు ఇప్పటికే ప్రారంభమయ్యాయని తెలిపారు. తరువాత, “ఇప్పుడు, మన ప్రధాని మోడీ జీ తెలంగాణకు ఎన్ని మెడికల్ కాలేజీలను మంజూరు చేశారో మీకు చెప్తాను” అని అంటూ సున్నా ఉన్నఫోటోను షేర్ చేస్తూ ట్వీట్ చేశారు.