Komatireddy Venkat Reddy: ఏపీ ఫలితాలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మరోసారి జగన్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని.. ఎగ్జిట్ పోల్స్‌లో అవే చెబుతున్నాయని ఆయన చెప్పారు. తన స్నేహితులు, బంధువుల సమాచారం మేరకు జగన్ రెండోసారి సీఎం అవుతారన్నారు. రాబోయే కాలంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్నారు. పార్లమెంట్ ఫలితాల తర్వాత బీఆర్‌ఎస్ అడ్రస్ గల్లంతు అవుతుందన్నారు. రాష్ట్ర చిహ్నం, తెలంగాణ గీతంపై ఎలాంటి వివాదం లేదన్నారు. పని లేని వాళ్ళు రాద్ధాంతం చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. ఆవిర్భావ వేడుకలు కనీవినీ ఎరుగని రీతిలో చేస్తామని, సోనియా రాక కోసం యావత్ తెలంగాణ ఎదురు చూస్తోందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెల్లడించారు.
Read Also: Komatireddy Venkat Reddy: సోనియా లేకపోతే తెలంగాణ వచ్చేది కాదు.. కేసీఆర్ కూడా చెప్పారు..
సోనియా లేకపోతే తెలంగాణ వచ్చేది కాదు, ఆ విషయాన్ని కేసీఆర్ నిండు సభలో చెప్పారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెల్లడించారు. కేసీఆర్ ప్రభుత్వంలో అన్ని స్కీంలలో స్కామ్‌లు జరిగాయని.. గొర్రెల పథకంలో భారీ స్కాం జరిగిందన్నారు. నిజామాబాద్ పార్లమెంట్‌తో సహా 12 పార్లమెంట్ స్థానాల్లో గెలుస్తామన్నారు. కాంగ్రెస్ వేవ్‌తో మా నేతలు గెలుస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాబోయే పదేళ్లు మా ప్రభుత్వమేనన్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్ కనుమరుగు అవుతుందన్నారు. ఆగస్టు 15 లోపు 2లక్షల రుణ మాఫీ చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. రాష్ట్రీయ గీతంపై కేటీఆర్ మతి భ్రమించి ఆందోళనలు చేస్తున్నారని విమర్శించారు. చిహ్నంపై అందరితో చర్చించి నిర్ణయం ఉంటుందన్నారు. ఫోన్ ట్యాపింగ్‌లో అందరు రావులే ఉన్నారని ఆరోపించారు. అప్పటి సీఎం కేసీఆర్‌కు మానవత్వం లేదన్నారు. ఆవిర్భావం వేడుకలకు కేసీఆర్‌ను ఆహ్వానించామని.. వస్తారా రారా అన్నది ఆయన విజ్ఞతకు వదిలేస్తామన్నారు.