Kishan Reddy: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా పునర్నిర్మిస్తున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. దక్షిణ భారత దేశంలోనే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు ప్రత్యేక ప్రాధాన్యత ఉందని ఆయన పేర్కొంటూ.. అమృత్ భారత్ పథకం కింద రూ. 714 కోట్లతో ఈ స్టేషన్ను ఆధునీకరిస్తున్నామని, ఇప్పటికే 50 శాతం పనులు పూర్తయ్యాయని ఆయన తెలిపారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని స్పష్టం చేశారు.
ప్రస్తుతం 1,97,000 మంది ప్రయాణికులు రోజువారీగా ఈ స్టేషన్కు వస్తున్నారని, ప్రతి గంటకు సుమారు 23 వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నప్పటికీ.. పనుల వేగం తగ్గకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. నూతన నిర్మాణాలలో భాగంగా సౌత్ మెయిన్ బిల్డింగ్, మల్టీ లెవెల్ కార్ పార్కింగ్, ట్రావెలర్ తో కూడిన ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు చకచకా జరుగుతున్నాయని ఆయన వెల్లడించారు.
సౌత్ సైడ్ బ్లాక్ నిర్మాణం రాబోయే నాలుగు నెలల్లో పూర్తి అవుతుందని, మొత్తం పునర్నిర్మాణ పనులను 13 నెలల్లో పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చామని కిషన్ రెడ్డి తెలిపారు. ఈ స్టేషన్ను 3 ఎకరాల విస్తీర్ణంలో 3 వేల మంది కూర్చునే విధంగా నిర్మిస్తున్నామని.. ఇది శంషాబాద్ ఎయిర్పోర్ట్ మాదిరిగా అత్యాధునికంగా ఉండనుందని ఆయన పేర్కొన్నారు. నవీకరించబడిన స్టేషన్లో 26 లిఫ్ట్లు, 32 ఎస్కలేటర్లు అందుబాటులోకి రానున్నాయి. అంతేకాకుండా, రెండు సబ్ స్టేషన్లు, అడ్వాన్స్డ్ సెక్యూరిటీ సిస్టమ్, 5 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్, 5 లక్షల లీటర్ల సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ వంటి సదుపాయాలు ఉండనున్నాయి. రోజుకు 2,70,000 మంది ప్రయాణికులు వచ్చినా సేవలు అందించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వివరించారు.