NTV Telugu Site icon

Minister Jupalli: దొంగే దొంగ అన్నట్లు కేసీఆర్, హరీశ్ పరిస్థితి ఉంది..

Jupalli Krishna Rao

Jupalli Krishna Rao

Minister Jupalli Krishna Rao: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మంత్రి జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు. నిన్న బడ్జెట్ మీద పదేళ్లు అనుభవం ఉన్న కేసీఆర్ ప్రభుత్వాన్ని బడ్జెట్ విషయంలో చీల్చి చెండాడుతాం అన్నారని.. అలాంటి కేసీఆర్ పదేళ్లలో వాస్తవిక బడ్జెట్ పెట్టలేదని విమర్శించారు.డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మొదటి సారి బడ్జెట్ పెట్టినా.. మీలాగా గ్యాస్…స్ట్రాష్ బడ్జెట్ పెట్టలేదంటూ పేర్కొన్నారు. పదేళ్లు ఆదాయానికి మించి ఖర్చు చేస్తామని.. కేసీఆర్ బడ్జెట్ ప్రవేశపెట్టారంటూ తెలిపారు. మోసం చేయకుండా.. వాస్తవాలకు దగ్గరగా ఎంత వస్తే అంతే ఖర్చు చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. రైతులను నట్టేట ముంచుతున్నామని కేసీఆర్ మాట్లాడుతున్నారని.. రైతు బంధు ఎత్తివేయలేదు కదా అంటూ మంత్రి జూపల్లి వ్యాఖ్యానించారు. గతంలో ఇచ్చిన దానికి ఎక్కడా తగ్గించలేదన్నారు. రైతులకు 31వేల కోట్ల రుణమాఫీ చేస్తున్నాం.. ఎలా నట్టేట ముంచినట్లు అవుతుందని ప్రశ్నించారు.

Read Also: SRSP: 61 ఏళ్లు పూర్తి చేసుకున్న శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు

రైతు బీమా కొనసాగిస్తున్నామని.. పంట బీమా కొత్తగా తీసుకువస్తున్నామన్నారు. క్వింటాల్‌కు రూ.500 రూపాయలు బోనస్ ఇచ్చే ఆలోచన చేస్తున్నామన్నారు. కేసీఆర్‌ తల తోక లేకుండా మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. కేసీఆర్‌ మాటలతో ప్రజలను మభ్యపెట్టాలని.. ప్రజలను మోసం చేయాలని చూస్తున్నాడని విమర్శించారు. దొంగే దొంగ అన్నట్లు కేసీఆర్, హరీష్ రావు పరిస్థితి ఉందన్నారు. మేము తెచ్చిన అప్పుల కన్నా.. కేసీఆర్ ప్రభుత్వం తెచ్చిన అప్పులు ఎక్కువగా తీర్చుతున్నామని మంత్రి అన్నారు. అసెంబ్లీకి ఎందుకు రావు.. అసెంబ్లీ అంటే అంత చిన్న చూపా అంటూ కేసీఆర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. రాజ్యాంగం, అంబేడ్కర్‌ గురించి మాట్లాడుతున్నారు.. అగౌరవపరిచింది మీరే అంటూ మంత్రి విమర్శలు గుప్పించారు.
బడ్జెట్‌లో 17శాతం కేసీఆర్ చేసిన అప్పులకే సరిపోతుందని అన్నారు. నెలకు 4-5 వేల కోట్లు అప్పుల వడ్డీలకు సరిపోతుందన్నారు. కేసీఆర్ తుగ్లక్ పాలన కాకుండా బాగా పరిపాలన చేసి ఉంటే.. తెలంగాణ అభివృద్ధిలో ఎక్కడో ఉంటుండే అంటూ మంత్రి అన్నారు.

ఒక్క రూపాయి కూడా ప్రజల మీద భారం మోపలేదన్నారు. అయినా వాస్తవిక బడ్జెట్ ప్రవేశపెట్టామన్నారు. ఆరు గ్యారంటీలు ఒక్కొక్కటి అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. మీలాగా అడ్డగోలుగా దోచుకునే ప్రయత్నం చేయడం లేదని అన్నారు. 7వ గ్యారంటీ ప్రజాపాలనకు శ్రీకారం చుట్టామన్నారు. స్వార్థ ప్రయోజనాల కోసం విద్యార్థులను రెచ్చగొడుతున్నారని.. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ప్రభుత్వానికి మంచి సూచనలు చేయాలని సూచించారు.

Show comments