Minister Harish Rao: భారతదేశ చరిత్రలోనే భూమి కోల్పోయిన గౌరవెల్లి ప్రాజెక్టు నిర్వాసితులకు రెండోసారి స్పెషల్ ప్యాకేజీ ఇవ్వడం ఇదే మొదటిసారి అని మంత్రి హారీష్ రావు అన్నారు.సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ సంక్షేమ సంబరాల కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే సతీష్ కుమార్ పాల్గొన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టులో ముంపునకు గురవుతున్న 5 తండాలకు చెందిన 185 మంది ఎస్టీలకు 8 లక్షల చొప్పున స్పెషల్ ప్యాకేజీతో పాటు ఇంటి స్థలం ఇస్తున్నామని మంత్రి చెప్పారు. తెలంగాణలో సంక్షేమంలో స్వర్ణ యుగని, రాష్ట్రం ఏర్పడిన నుండి ఇప్పటివరకు 5 లక్షల కోట్ల రూపాయలు సంక్షేమ పథకాలపై ఖర్చు చేశామన్నారు.
Read Also: Karnataka: ప్రభుత్వ బస్సుల్లో మహిళకు ఉచిత ప్రయాణం.. కండక్టర్‌గా మారనున్న సీఎం
ఆసరా పెన్షన్లతో వృద్ధుల ఆత్మగౌరవాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ నిలబెట్టారన్నారు. మహాభారతంలోని కౌరవుల్లాగా కాంగ్రెస్, బీజేపీ వాళ్లు కుట్రలు చేసి గౌరవెల్లి ప్రాజెక్టును అడ్డుకున్నా పూర్తి చేశామని మంత్రి పేర్కొన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టుతో హుస్నాబాద్‌లో కరువు అనే పదం ఉండదు, ఇక హుస్నాబాద్‌లో కరువుకు సెలవు అని ఆయన వెల్లడించారు. అతి త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా గౌరవెల్లి ప్రాజెక్టు ప్రారంభింపజేసి, వానాకాలంలోనే గోదావరి జలాలు తీసుకొచ్చి ఇక్కడి రైతుల కాళ్లు కడుగుతామని మంత్రి హరీష్ రావు హామీ ఇచ్చారు. గంగి గోవులాగా పనిచేసే వ్యక్తి ఎమ్మెల్యే సతీష్ కుమార్ అని మంత్రి కొనియాడారు. సద్ది తిన్న రేవు మరువద్దు మరోసారి బీఆర్ఎస్ పార్టీని, ఎమ్మెల్యే సతీష్ కుమార్‌ను ప్రజలు ఆశీర్వదించాలన్నారు.