Karnataka: ప్రభుత్వ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కర్ణాటకలో కాంగ్రెస్ విజయానికి ప్రధాన కారణంగా నిలిచింది. అయితే ఈ పథకాన్ని ఆదివారం సీఎం సిద్ధరామయ్య ప్రారంభించనున్నారు. ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు. విద్యార్థినులకు కూడా ఈ సౌకర్యం వర్తిస్తుందని ప్రభుత్వం వెల్లడించింది. అయితే ఇందుకు కొన్ని కండిషన్లను కూడా పెట్టింది. అయితే రాజహంస, వజ్ర, వాయువజ్ర, ఐరావత, ఐరావత క్లబ్ క్లాస్, ఐరావత గోల్డ్ క్లాస్, అంబారీ, అంబారీ డ్రమ్ క్లాస్, అంబారీ ఉత్సవ్, ఎఫ్టీ బస్, ఈవీ పవర్ ప్లస్ బస్సుల్లో ఉచిత ప్రయాణం వర్తించదని తెలిపింది.
Read Also: Supreme Court: “ఉబర్, ర్యాపిడో” కేసులో కేంద్రం అభిప్రాయాన్ని కోరిన సుప్రీంకోర్టు..
మహిళలకు ఉచిత ప్రయాణానికి అనుమతి ఇచ్చిన బస్సుల్లో కొన్ని సీట్లను పురుషుల కోసం రిజర్వ్ చేశారు. ఆదివారం సీఎం కండక్టర్ గా మారనున్నారు. దీనికోసం బెంగళూరులోని మెజస్టిక్ కెంపెగౌడ బస్‌స్టేషన్ నుంచి విధాన సౌధ వరకు రూట్ నంబర్ 43 సిటీ బస్‌లో ప్రయాణించనున్నారు. స్వయంగా ప్రయాణికులకు టికెట్లను జారీ చేయనున్నారు. మహిళలకు స్మార్ట్ కార్డులను కూడా అందచేయనున్నారు. పురుష ప్రయాణికులకు బస్ టికెట్లు జారీ చేయనున్నారు. ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ కూడా కర్ణాటక ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారు. సింప్లిసిటీకి కాంగ్రెస్ నేతలు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు.