Minister Bala Veeranjaneya Swamy: మాది ఉద్యోగస్తుల ఫ్లెండ్రీ సర్కార్.. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరడంలో వారిదే కీలక పాత్ర అన్నారు రాష్ట్ర సామాజిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి.. ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గంలోని ఆరు మండలాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఆయన.. సమావేశంలో భాగంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కార్యక్రమం జులై 1వ తేదీన ఉదయం 6 గంటలకే పెన్షన్ల పంపిణీ ప్రారంభించాలి.. సాయంత్రం 5 గంటల కల్లా పంపిణీ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా సీజనల్ వ్యాధులకు సంబంధించి ఆర్‌డబ్ల్యూఎస్, పంచాయతీ రాజ్, హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులు అప్రమత్తంగా ఉండి తగు చర్యలు తీసుకోవాలన్నారు.. రాష్ట్ర అభివృద్ధికి, సంక్షేమానికి ఉద్యోగస్తులు సహకరించాలని కోరారు.. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అప్పుడు, ఇప్పుడు ఉద్యోగస్తులతో ఫ్రెండ్లీ గానే ఉంటుందని.. దానికి తగినట్టు ప్రభుత్వ పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్లి అందజేయడంలో ఉద్యోగస్తులు కీలకంగా పని చేయాలని సూచించారు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి.
Read Also: Pension Distribution: పెన్షన్‌దారులకు గుడ్‌న్యూస్.. రూ.4,400 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం
కాగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జులై 1వ తేదీన పెన్షన్ల పంపిణీకి సిద్ధం అవుతోంది.. పెన్షన్ల పంపిణీ నిమిత్తం ఇప్పటికే రూ. 4,400 కోట్ల నిధులు విడుదల చేసింది ప్రభుత్వం.. జులై 1వ తేదీన 65.18 లక్షల మందికి గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా ఇంటింటికి వెళ్లి ఫించన్లు పంపిణీ చేపట్టాలని స్పష్టం చేశారు ఏపీ సీఎస్.. ఫించన్ల పంపిణీకి ఇతర ఫంక్షనరీల సేవలను కూడా వినియోగించుకోవాలని సూచించారు.. జిల్లా కలెక్టర్లు, ఎంపీడీవో, మున్సిపల్ కమిషనర్లు.. పెన్షన్ల పంపిణీపై గంట గంటకూ పర్యవేక్షించాలని ఆదేశించారు. సోమవారం ఉదయం 6 గంటలకే పెన్షన్ల పంపిణీని ప్రారంభించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ జులై 1వ తేదీన 90 శాతానికి పైగా పింఛన్లు పంపిణీ పూర్తి చేయాలని స్పష్టం చేశారు. పెన్షన్ల పంపిణీకి సంబంధించి ప్రభుత్వం బ్యాంకులకు విడుదల చేసిన డబ్బులను ఇవాళ రాత్రిలోగా విత్ డ్రా చేసుకోవాలని సూచించారు సీఎస్. అయితే, ఎన్నికల్లో పెన్షన్‌ను పెంచనున్నట్టు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చిన విషయం విదితమే.. దాని అనుగుణంగానే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే ఆ ఫైల్‌పై సంతకం చేశారు.. వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన మూడు వేల పించన్ నాలుగు వేలకు పెంచింది కూటమి సర్కారు.. ఏప్రిల్ నెల నుంచే పెంచిన మొత్తాన్ని ఇస్తామని ఎన్నికల ప్రచారంలో వాగ్దానం చేయగా.. ఆ ప్రకారం జులై నెలకు ఇచ్చే నాలుగు వేల ఫించన్ తోపాటు గడచిన మూడు నెలలకు ఇవ్వాల్సిన మూడు వేల రూపాయలను కలిపి లబ్ధిదారులకు ఇవ్వనున్నారు.