AP CM Chandrababu: మూలా నక్షత్రం రోజున ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సరస్వతీ అలంకారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు పట్టువస్త్రాలను సమర్పించనున్నారు. ఈ వేడుకను తిలకించేందుకు భారీగా భక్తులు వస్తారని అంచనా. ఈ క్రమంలోనే మూలా నక్షత్రం ఏర్పాట్లపై దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దుర్గాఘాట్ మోడల్ గెస్ట్ హౌస్‌లో అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో దేవాదాయ శాఖ కమిషనర్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్, సీపీ, ఈవోలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో మూలా నక్షత్రం ఏర్పాట్లు, సీఎం రాకపై సమీక్ష నిర్వహించారు. ఇప్పటి వరకూ ఎదురైన సమస్యలు, రేపు మూల నక్షత్రం నాడు ఎదుర్కోవాల్సిన సవాళ్లపై సమీక్షించారు. ముఖ్యమంత్రి రాక సమయంలో సామాన్య భక్తుల దర్శనానికి భంగం కలగకుండా ఏర్పాట్లు చేయాలని సమీక్షలో చర్చించారు. సీఎం వెళ్ళే దారిలో ఫోటో స్టాండ్ల ఏర్పాటు, క్యూలైన్ల కూర్పు, భక్తులను క్యూలైన్లలో వదలడం, దర్శన సమయం, వీఐపీలు, వాహనాల అనుమతులు, డ్రోన్ల వాడకంపై సమీక్షించారు.
Read Also: Minister Satya Kumar Yadav: ఎఫ్‌ఎస్ఎస్‌ఏఐతో ఏపీ రూ.88 కోట్ల ఎంఓయూ.. ఒప్పందంపై సంతకాలు
మూల నక్షత్రం నాడు అధిక సంఖ్యలో తెల్లవారుజాము నుంచే భక్తులు వస్తుంటారని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. 3 గంటల నుంచి ప్రారంభమయ్యే క్యూలైన్లు అన్నీ ఉచితమేనని పేర్కొన్నారు. మంచినీరు, మజ్జిగ, పాలు యథావిథిగా పంపిణీ చేస్తామన్నారు. సీఎం చంద్రబాబు అమ్మవారికి పట్టువస్త్రాలు ఇవ్వడానికి మధ్యాహ్నం 2 గంటలకు వస్తారని చెప్పారు. సీఎం చంద్రబాబుకు మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకూ కేటాయించామన్నారు. శాసనసభ్యులు, మంత్రులు, అధికారులు బంగారు వాకిలి నుంచి దర్శనం చేసుకుంటారని చెప్పారు. సీఎంతో పాటుగా మంత్రులు, సీఎం కుటుంబ సభ్యులు అంతరాలయ దర్శనం చేసుకుంటారన్నారు. కొండచరియలు జారినవి, తిరిగి నిర్మించినవి, వరదల కాలం నాటివి ఫోటోలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. సీఎం అంతరాలయంలో ఉన్నప్పటికి సామాన్యుడి దర్శనానికి ఇబ్బంది లేకుండా చూస్తామన్నారు. సీఎం సెక్యూరిటీ పరంగా అన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకుంటామన్నారు.