సీఎం చంద్రబాబు నాయుడు బీసీలకు మరోసారి పెద్దపీట వేశారని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. చంద్రబాబు నాయకత్వంలో బీసీ నేతలకు, అధికారులకు ఎప్పుడూ సమున్నత గౌరవం ఉంటుందన్నారు. ప్రస్తుతం ప్రభుత్వంలో చాలామంది బీసీ నేతలు కీలక పదవుల్లో ఉన్నారని, ఇదంతా సీఎం చంద్రబాబు ఘనతే అని మంత్రి అనగాని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా కె.విజయానంద్ నియమితులయ్యారు. 1992 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ఆయనను సీఎస్‌గా నియమిస్తూ ఆదివారం రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత సీఎస్ నీరబ్‌కుమార్ ప్రసాద్ మంగళవారం పదవీవిరమణ చేయనుండగా.. ఆ స్థానంలో కొత్త సీఎస్‌గా విజయానంద్ బాధ్యతలు చేపడతారు.
బీసీ సామాజిక వర్గానికి చెందిన కె.విజయానంద్‌కి సీఏస్ బాధ్యతలు ఇవ్వడంపై మంత్రి అనగాని సత్యప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. సీఎస్‌గా ఎంపికైన విజయానంద్‌కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ‘సీఎం చంద్రబాబు నాయకత్వంలో బీసీలకు మరోసారి పెద్దపీట వేశారు. 1992 బ్యాచ్‌కు చెందిన బీసీ అధికారికి ముఖ్యమంత్రి చంద్రబాబు టాప్ పోస్ట్ ఇచ్చారు. చంద్రబాబు నాయకత్వంలో బీసీ నేతలకు, అధికారులకు ఎప్పుడూ సమున్నత గౌరవం ఉంటుంది. తొలిసారి బీసీ అధికారికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా చంద్రబాబు అవకాశం కల్పించారు. అత్యంత ప్రాధాన్యత కలిగిన టీటీడీ ఈవోగా బీసీ అధికారి శ్యామల రావు ఉన్నారు. ప్రస్తుతం డీజీపీగా ఉన్న ద్వారకా తిరుమల రావు కూడా బీసీనే. తెలుగు దేశం రాష్ట్ర పార్టీ అధ్యక్షునిగా బీసీ నేత పల్లా శ్రీనివాస్ ఉన్నారు. శాసన సభ స్పీకర్‌గా మరో సీనియర్ నేత చింతకాలయ అయ్యన్న పాత్రుడుకు అవకాశం ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వంలో సీఏస్, డీజీపీ సహా అన్ని కీలక స్థానాల్లో తన సామాజిక వర్గానికి చెందిన వాళ్లనే వైఎస్ జగన్ నియమించారు’ అని మంత్రి అనగాని పేర్కొన్నారు.