Satya Nadella: మైక్రోసాఫ్ట్ సీఈవో, భారత సంతతికి చెందిన సత్య నాదెళ్ల భారత మూడవ అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషణ్ అవార్డును అందుకున్నారు. ఈ ఏడాది జనవరిలో ఆయనకు భారత ప్రభుత్వం ఈ అవార్డును ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ అత్యున్నత పురస్కారాన్ని అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో భారత కాన్సుల్ జనరల్ డాక్టర్ టీవీ నాగేంద్ర ప్రసాద్ నుంచి సత్య నాదెళ్ల అందుకున్నారు. అనంతరం కాన్సుల్ జనరల్ నాగేంద్ర ప్రసాద్‌తో ఆయన భేటీ అయ్యారు. ఈ విషయాన్ని మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. అంతకుముందు అనివార్య కారణాల వల్ల ఈ అవార్డును అందుకునేందుకు సత్యనాదెళ్ల భారత్‌కు రాలేకపోయారు. 17 మంది అవార్డు గ్రహీతలలో ఆయన ఒకరిగా ఎంపికైన సంగతి తెలిసిందే.
పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకోవడం తనకు గౌరవంగా భావిస్తున్నానని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల పేర్కొన్నారు. వచ్చే ఏడాది జనవరిలో భారత్‌లో పర్యటించనున్నట్లు ఆయన చెప్పారు. సాంకేతిక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు భారత ప్రజలతో కలిసి పనిచేయడం కోసం ఎదురుచూస్తున్నానన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి, ప్రధాని నరేంద్రమోడీ, భారత ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
Liz Truss Resign: యూకే ప్రధాని లిజ్ ట్రస్ రాజీనామా.. అక్కడ మళ్లీ రాజకీయ సంక్షోభం
హైదరాబాద్‌లో జన్మించిన సత్య నాదెళ్ల 2014, ఫిబ్రవరిలో మైక్రోసాఫ్ట్ సీఈవోగా నియమితులయ్యారు. జూన్ 2021లో ఆయన కంపెనీ ఛైర్మన్‌గా కూడా నియమితులయ్యారు. బోర్డుకు ఎజెండాను రూపొందించే పనిలో ఆయన నాయకత్వం వహిస్తున్నారు.