ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖెల్ క్లార్క్ స్కిన్ క్యాన్సర్‌తో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో సర్జరీలు చేయించుకున్న క్లార్క్.. తాజాగా మరో స్కిన్ క్యాన్సర్ సర్జరీని చేయించుకున్నాడు. ఈ విషయాన్ని అతడే స్వయంగా వెల్లడించాడు. ఆస్ట్రేలియాలో స్కిన్ క్యాన్సర్ సహజమే అని, తాజాగా తాను మరో సర్జరీ చేసుకున్నానని ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టాడు. క్లార్క్ ఇప్పటివరకు డజన్‌కు పైగా చికిత్సలు చేసుకున్నట్లు తెలుస్తోంది.
‘ఆస్ట్రేలియాలో స్కిన్ క్యాన్సర్ చాలా సహజం. నా ముక్కుపై మరో కట్ పడింది. మీకు ఓ సలహా ఇస్తున్నా.. మీ చర్మానికి సంబంధించి ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించుకోండి. చికిత్స కంటే నివారణే చాలా ఉత్తమం. నా విషయంలో రెగ్యులర్ చెకప్‌లు, ముందస్తుగా క్యాన్సర్ గుర్తించడం చాలా కీలకంగా నిలిచాయి’ అని మైఖెల్ క్లార్క్ ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నాడు. 2006 నుంచి క్లార్క్ డజన్‌కు పైగా క్యాన్సర్లకు చికిత్సలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రపంచంలో చర్మ క్యాన్సర్ల రేట్ ఆస్ట్రేలియాలో ఎక్కువ.
మైఖెల్ క్లార్క్ 2004 నుంచి 2015 మధ్య ఆస్ట్రేలియా తరఫున 115 టెస్టులు, 245 వన్డేలు, 34 టీ20లు ఆడాడు. టెస్టుల్లో 8643, వన్డేల్లో 7981, టీ20ల్లో 488 రన్స్ చేశాడు. మూడు ఫార్మాట్లలో కలిపి 36 శతకాలు బాదాడు. 74 టెస్టులు, 139 వన్డేల్లో ఆసీస్ జట్టుకు నాయకత్వం వహించాడు. క్లార్క్ సారథ్యంలోనే 2014 యాషెస్ సిరీస్, 2015 ప్రపంచకప్‌ను ఆస్ట్రేలియా గెలుచుకుంది. ఎన్నో ఆసీస్ విజయాల్లో క్లార్క్ కీలకంగా వ్యవహరించాడు.