డాక్టర్లు దేవుడితో సమానం అంటారు. చావుబతుకుల మధ్య ఉన్న రోగికి వైద్యం చేసి ప్రాణాలు నిలబెడతారు. అందుకే వైద్యుల్ని దేవుడితో సమానం అంటారు పెద్దలు. ఇది ముమ్మాటికీ వాస్తవమే. దేవుడు ప్రాణం పోస్తే.. వైద్యంతో మరో పునర్జన్మ ఇస్తుంటారు వైద్యులు. అందుకే వీళ్లకు చేతులెత్తి మొక్కుతుంటారు. ఇంతటి పవిత్రమైన వృత్తిలో ఉన్నవాళ్లు ఎంత గౌరవంగా ఉండాలి. అలాంటిది చిల్లరి చేష్టలతో తమ విలువను దిగజార్చుకుంటున్నారు కొందరు వైద్యులు. ఆపరేషన్ థియేటర్ అంటే ఓ నిండు ప్రాణాన్ని నిలబెట్టే కేంద్రం. అలాంటి చోట ఓ వైద్యుడు.. కాబోయే భార్యతో కలిసి ప్రీ వెడ్డింగ్ షూటింగ్‌కి వాడుకున్నాడు. దీన్ని మరువకముందే మరికొంత మంది వైద్యులు బాలీవుడ్ సినిమా పాటలకు డ్యాన్సులు వేసి బహిష్కరణకు గురయ్యారు. ఈ ఘటనలు కర్ణాటకను షేక్ చేయగా.. నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు.
కర్ణాటకలోని గడగ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (GIMS)కి చెందిన వైద్య విద్యార్ధుల బృందాలు ఆస్పత్రి ఆవరణలోనే శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్ పాటలకు హద్దులదాటి డ్యాన్స్ చేశారు. ఈ వీడియోలు కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వైద్యాధికారులు సీరియస్‌గా తీసుకుని 35 మంది వైద్య విద్యార్థులను 10 రోజుల పాటు సస్పెండ్ చేశారు.
మెడికోల డ్యాన్స్‌పై జిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బసవరాజ్ బొమ్మనహళ్లి స్పందించారు. ఎలాంటి పర్మిషన్ లేకుండానే విద్యార్థులు డ్యాన్స్‌లు (Medicos Dancing) చేశారని తెలిపారు. 38 మందికి పైగా వైద్య విద్యార్థుల ప్రమేయం ఉందని వెల్లడించారు. వీరిలో చాలా మంది MBBS కోర్సు పూర్తి చేసి ప్రస్తుతం ఆస్పత్రిలో హౌస్ సర్జన్ కోర్సును అభ్యసిస్తున్నారని పేర్కొన్నారు (Karnataka Government Hospital). కొద్ది రోజుల్లో వీరిది గ్రాడ్యుయేట్ పూర్తవుతుందని.. ప్రీ-గ్రాడ్యుయేషన్ వేడుకల్లో భాగంగానే ఈ రీల్స్ తీసినట్లు చెప్పుకొచ్చారు. ఈ ఘటనలో ప్రమేయం ఉన్న వారందరిపైనా తగిన చర్యలు ఉంటాయని పేర్కొన్నారు.
అయితే మెడికోల వ్యవహారంపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. వైద్య వృత్తిలో ఉండి ఇలాంటి పనులేంటని ధ్వజమెత్తుతున్నారు. అలాగే ఈ ఘటనపై కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ గుండూరావు స్పందించారు. ఇటువంటి చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని.. తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ప్రభుత్వ ఆస్పత్రులు ప్రజలకు ఆరోగ్య సంరక్షణ సేవలు అందించడానికి మాత్రమే ఉన్నాయని.. వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదని స్పష్టం చేశారు. ఇంకోవైపు నెటిజన్లు కూడా ఈ వ్యవహారంపై మండిపడుతున్నారు.
ఇకపోతే భరమసాగర తాలూకా ఆస్పత్రిలోని ఆపరేషన్ థియేటర్‌లో ఏకంగా ఓ డాక్టర్.. కాబోయే భార్యతో ప్రీ-వెడ్డింగ్ షూట్‌ను చిత్రీకరించాడు. ఈ వీడియో వైరల్ కావడంతో ఆ వైద్యుడ్ని అధికారులు తప్పించారు.