మెదక్ జిల్లా చిన్నశంకరంపేట పెట్రోల్ పంప్ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. మద్యం మత్తులో రోడ్డు ప్రమాదం జరిగినట్లు గుర్తించారు. నలుగురు యువకులు ఫ్రెండ్ బర్త్ డే కోసం ఎర్టీగా కారు రెంట్ కి తీసుకుని వెళ్లారని తెలిపారు. బర్త్ డే పార్టీలో మద్యం సేవించినట్లు వెల్లడించారు.
Also Read:Kissing: అడ్రస్ వెరిఫికేషన్ కోసం వచ్చిన మహిళా ఉద్యోగికి ‘‘ముద్దు’’.. నిందితుడికి ఏడాది జైలు శిక్ష..
పార్టీ అనంతరం తిరిగి వస్తుండగా తెల్లవారుజామున యువకులు మద్యం మత్తులో కరెంట్ స్తంభాన్ని ఢీ కొట్టడంతో కారు బోల్తా కొట్టినట్లు తెలిపారు. ప్రమాద ధాటికి కరెంట్ స్తంభం విరిగిపోయింది. విద్యుత్ వైర్లు తెగిపోయాయి. ఈ ప్రమాదంలో జశ్వంత్ అనే 18 ఏళ్ల యువకుడు మృతి చెందాడు. గాయపడ్డ వారిని సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. కారులో ఉన్న నలుగురు యువకులు 20 ఏళ్ల లోపు వారేనని పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.