Wrestlers Protest: రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్‌ను ఆ పదవి నుంచి తొలగించాలని కోరుతూ రెజ్లర్లు చేపట్టిన ఆందోళనకు క్రమంగా మద్దతు పెరుగుతోంది. తాజాగా రెజ్లర్ల ఆందోళనకు మద్దతుగా రైతు సంఘం సంయుక్త కిసాన్ మోర్చా నేతలు ఆదివారం ఢిల్లీలోని జంతర్‌మంతర్‌కు వచ్చారు. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భూషణ్ సింగ్‌పై నిరసనలో అగ్రశ్రేణి రెజ్లర్‌లతో చేరిన రైతులు ఆదివారం కేంద్ర ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు. రెజ్లర్లకు మద్దతుగా నిరసన తెలిపిన రైతు సంఘం నాయకులు బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్‌పై చర్య తీసుకోవాలని ప్రభుత్వానికి 15 రోజుల గడువు ఇచ్చారు. పోక్సో చట్టం కింద ఒకటి సహా రెండు ఎఫ్‌ఐఆర్‌లు ఎదుర్కొంటున్న ఫెడరేషన్ చీఫ్‌ను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ సరిహద్దు రాష్ట్రాల నుంచి ఖాప్ పంచాయితీ నేతలు సైతం రెజ్లర్ల ఆందోళన స్థలికి రావడంతో జంతర్ మంతర్‌తో పాటు దిల్లీ సరిహద్దుల్లో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.
విలేఖరుల సమావేశంలో రైతు నాయకుడు రాకేష్ టికైత్ మాట్లాడుతూ.. రెజ్లర్లు తమ ఆందోళనను కొనసాగించాలని, మే 21 లోగా బ్రిజ్ భూషణ్‌ను అరెస్టు చేయకపోతే, భవిష్యత్తు కార్యాచరణపై ఆ రోజు నిర్ణయం తీసుకుంటామని అన్నారు. రెజ్లర్లను అవమానిస్తే సహించేది లేదన్నారు. వినేష్ ఫోగట్, సాక్షి మాలిక్, బజరంగ్ పునియాతో సహా పలువురు అగ్రశ్రేణి రెజ్లర్లు బ్రిజ్ భూషణ్ సింగ్‌ను అరెస్టు చేసి సమాఖ్య నుండి తొలగించాలని కోరుతూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనలు చేస్తున్నారు. వారితో ఈరోజు ఖాప్ పంచాయతీ నాయకులు, రైతు, కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.
Read Also: Republic Day: ఈ సారి రిపబ్లిక్ పరేడ్‌లో అందరూ మహిళలే.. కేంద్రం కీలక నిర్ణయం
పెరుగుతున్న నిరసనల నేపథ్యంలో, తన పదవిని వదులుకోకుండా ధిక్కరిస్తూనే ఉన్న బ్రిజ్ భూషణ్ సింగ్, తనపై ఒక్క ఆరోపణ అయినా రుజువు చేస్తే ఉరివేసుకుంటానని చెప్పాడు. సంయుక్త కిసాన్ మోర్చా రెజ్లర్లకు మద్దతు ఇవ్వడంతో, విచారణ ఫలితం కోసం వేచి ఉండాలని బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ రైతు నాయకులను కోరారు. కైసర్‌గంజ్‌కు చెందిన బీజేపీ ఎంపీ సింగ్ మళ్లీ తాను నిర్దోషినని, రెజ్లర్ల ఎంపిక ప్రక్రియలో సంస్కరణలు తీసుకొచ్చినందున తనను టార్గెట్ చేశారని ఆరోపించారు. శనివారం రాత్రి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన 25 నిమిషాల వీడియోలో, “నాపై ఆరోపణలు రుజువైతే, ఉరి వేసుకుంటానని మొదటి రోజు నుంచి చెబుతున్నాను, నన్ను నమ్మండి. మీ గ్రామంలోని కుమార్తెలు కుస్తీలో ఉంటే బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై వచ్చిన ఆరోపణల గురించి ఎవరూ లేనప్పుడు వారిని అడగండి. ఆ తర్వాత మీరు ఏమైనా చేసుకోవచ్చు. విచారణ పూర్తయ్యాక, నేను మీ ఖాప్ పంచాయితీకి వస్తాను, నేను దోషిగా తేలితే మీరు నన్ను బూట్లతో కొట్టి చంపవచ్చు.” అని బ్రిజ్‌భూషణ్ అన్నారు.