Republic Day: భారత రిపబ్లిక్ డే వేడుకల పరేడ్ అద్భుతంగా ఉంటుందని అందరికి తెలిసిన విషయమే. ఢిల్లీ కర్తవ్యపథ్‌లో జరిగే పరేడ్‌లో భద్రతా బలగాలు, వివిధ రాష్ట్రాల శకటలు, ఆయుధ ప్రదర్శనలు సంగీత ప్రదర్శనలు కళ్లు తిప్పుకోకుండా సాగుతాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతిఏటా గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహిస్తుంది. అంతటి ప్రాధాన్యమున్న పరేడ్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో జరిగే పరేడ్ వేడుకలో పోలీస్, ఆర్మీ, పారామిలటరీ దళాలు పాల్గొంటాయనే విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకు జరిగిన ఈ వేడుకల్లో పురుషులు, మహిళలు పాల్గొనేవారు. కానీ వచ్చే ఏడాది మాత్రం ఈ సంప్రదాయాన్ని మార్చనున్నారు. స్త్రీ పురుష జవాన్లు పాల్గొనే ఈ కవాతులో కీలక మార్పు చేసింది. వచ్చే ఏడాది(2024) రిపబ్లిక్ డే పరేడ్ కేవలం మహిళా సైనికులతోనే కవాతు నిర్వహించనుంది.
అన్ని రంగాల్లో మహిళలు పురుషులకు దీటుగా దూసుకెళ్తుతున్న నేపథ్యంలో నారీ శక్తిని చాటడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. సైన్యంతో పాటు అన్ని రంగాల్లో మహిళల ప్రాతినిధ్యాన్ని, సాధికారతను పెంచడానికి ఈసారి వీరనారులతో కవాతు నిర్వహిస్తామని అధికారులు చెప్పారు. ఈ దిశగా ఇప్పటికే త్రివిధ బలగాలు చర్యలు తీసుకుంటున్నాయని వివరించారు. అయితే గత మార్చిలోనే రిపబ్లిక్ డే పరేడ్‌లో పాల్గొననున్న వివిధ రక్షణ సంస్థలు, ఆర్మీ, పోలీస్, పారామిలటరీలకు ఈ సమాచారం అందించినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది పరేడ్‌కు నేతృత్వం వహించే దగ్గరి నుంచి బ్యాండ్ పార్టీ, శకటాల ప్రదర్శనల వరకు అందరూ మహిళలే ఉండనున్నారని కేంద్ర ప్రభుత్వ సీనియర్ అధికారి తెలిపారు. మరోవైపు కేంద్రం నుంచి ఈ విషయంపై తమకు కూడా అధికారిక లేఖ అందిందని, అయితే, దీనిని ఎలా అమలు చేయాలన్నదానిపై కసరత్తు చేస్తున్నట్సు ఆర్మీ వర్గాలు కూడా వెల్లడించాయి.
Read Also: Bomb Blast: స్వర్ణ దేవాలయం సమీపంలో భారీ పేలుడు..
గణతంత్ర దినోత్సవ వేడుకలు భారత సైనిక శక్తికి, సంస్కృతి సంప్రదాయాలకు, విజయాలకు అద్దం పడతాయి. ఈ కార్యక్రమానికి వేలాది మంది ప్రముఖులు హాజరై ప్రత్యక్షంగా తిలకిస్తారు. కోట్లాది మంది టీవీల్లో చూస్తారు. విదేశాలకు చెందిన ఓ ప్రముఖ వ్యక్తిని ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తారు. అందువల్ల కేంద్రం ఈ వేడుకలను చాలా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తుంది. ఈ క్రమంలోనే మహిళా శక్తిని ప్రపంచానికి తెలియజేసేలా, వారిని మరింత ప్రోత్సహించేలా కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 2015లో తొలిసారిగా త్రివిధ దళాల నుంచి వేర్వేరుగా మహిళల బృందం రిపబ్లిక్ డే పరేడ్‌లో పాల్గొంది. 2019లో కెప్టెన్ శిఖా సురభి ఆర్మీ డేర్‌డెవిల్స్ జట్టులో భాగంగా బైక్ స్టంట్ చేసిన మొదటి మహిళా అధికారిగా గుర్తింపు పొందింది. మరుసటి సంవత్సరం కెప్టెన్ తానియా షెర్గిల్ మొత్తం పురుషుల బృందానికి నాయకత్వం వహించిన మొదటి మహిళా అధికారి అయ్యారు. 2021లో ఫ్లైట్ లెఫ్టినెంట్ భావనా కాంత్ పరేడ్‌లో పాల్గొన్న మొదటి మహిళా ఫైటర్ పైలట్ అయ్యారు.