Yediyurappa: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప నివాసం, కార్యాలయంపై రాళ్లదాడి జరిగింది. భారీ ఎత్తున జనాలు గుమిగూడి, ఆయన ఇల్లు, కార్యాలయంపై రాళ్లు విసిరారు. సోమవారం మధ్యాహ్నం శివమొగ్గ జిల్లాలోని షికారిపురలో ఆయన నివాసం వద్ద ఈ ఘటన జరిగింది. బీజేపీ ప్రభుత్వం ఎస్సీ కోటాలో అంతర్గత రిజర్వేషన్లు తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తూ బంజారా, భోవి సామాజిక వర్గాలకు చెందిన వారు యడియూరప్ప నివాసం ఎదుట ఆందోళనలు చేపట్టారు. ఈక్రమంలోనే రాళ్ల దాడి జరిగింది. దీంతో పోలీసులు వారిని చెదరగొట్టేందుకు లాఠీ ఛార్జ్ చేశారు. అనంతరం ఆ ప్రాంతంలో 144 సెక్షన్ విధించారు. భారీ ఎత్తున జనాలు నిరసన తెలుపుతున్న వీడియోలు నెట్టింట ప్రత్యక్షమయ్యాయి.
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ కర్ణాటక అధికార బీజేపీ తీసుకున్న నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. షెడ్యూల్ కులాలు, తెగలకు చెందిన రిజర్వేషన్లపై ఇటీవల కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే ఈ నిరసనకు కారణమైంది. కర్ణాటక ఎస్సీ రిజర్వేషన్లలో బంజారాలు అధిక ప్రయోజనం పొందేవారు. విద్య, ఉద్యోగాల విషయంలో షెడ్యూల్ కులాల రిజర్వేషన్లను కొత్తగా వర్గీకరించాలని సీఎం బసవరాజ్ బొమ్మై సర్కార్ కేంద్రానికి సిఫార్సు చేసింది. దాని ప్రకారం ఎస్సీలకు ఉన్న 17 శాతం రిజర్వేషన్లను అంతర్గత వర్గీకరణ చేస్తారు. ఏజే సదాశివ కమిషన్ నివేదిక ఆధారంగా కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నిర్ణయం వల్ల తాము నష్టపోతామని బంజారా వర్గం నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఆ అంతర్గత వర్గీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఈ అగ్రనేత ఇంటిపై దాడికి దిగారు.
Read Also: Eknath Shinde: రాహుల్ గాంధీ అండమాన్ జైల్లో ఉండాలి.. సావర్కర్ వ్యాఖ్యలపై ఏకనాథ్ షిండే ధ్వజం
ప్రస్తుతం ఎస్సీలను ఉపకులాలుగా విభజించి కర్ణాటక సర్కారు రిజర్వేషన్లు అమలు చేస్తోంది. దీంతో గతంలో ఎస్సీ రిజర్వేషన్లలో 17 శాతం వరకు లబ్ధిపొందే బంజారా కమ్యూనిటీ ఇప్పుడు 4.5 శాతానికే పరిమితం అయింది. ఈ నేపథ్యంలోనే తమకు అన్యాయం జరుగుతోందని వారు కర్ణాటక మాజీ సీఎం యడియూరప్ప నివాసం ఎదుట ఆందోళనలు చేపట్టడం ఉద్రిక్తతలకు దారితీసింది.
#WATCH | Karnataka: Protestors were lathicharged by the police in Shivamogga as they were protesting against the implementation of the former Justice Sadashiva Commission's report. pic.twitter.com/eEg4HmpTQ6
— ANI (@ANI) March 27, 2023