నగరంలోని పలు చెరువులను హైడ్రా కమీషనర్ రంగనాథ్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. చెరువుల ఆక్రమణలపై ఫిర్యాదుల రావడంతో రంగనాథ్ తనిఖీలు చేపట్టారు. నానక్‌రామ్ గూడకు చేరువలో ఉన్న తౌతానికుంట, భగీరథమ్మ చెరువు, నార్సింగ్‌లోని నెక్నాంపూర్ చెరువుల ఆక్రమణలపై కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తౌతాని కుంట, భగీరథమ్మ చెరువుల ఆక్రమణలతో పాటు.. ఆయా చెరువల్లోకి వరద నీరు చేరకుండా కాలువలను మల్లించడం.. మూసివేయడంపై రెవెన్యూ, ఇరిగేషన్, జీహెచ్ ఎంసీ, హెచ్ఎండీఏ అధికారులతో క్షుణ్నంగా పరిశీలించి సమగ్ర నివేదిక సమర్పించాలని హైడ్రా అధికారులకు కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు.
Read Also: TG Cabinet: ఈ నెల 30న తెలంగాణ కేబినెట్ భేటీ
చెరువులలో మట్టిపోయడంతో పాటు ఆఖరికి వరద కాలువలను కూడా కనిపించకుండా నిర్మాణాలు చేపడుతున్నారని స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ ఖాళీ స్థలంలో వర్షపు నీరు వెళ్లే రహదారులు మూసుకుపోవడంతో తమ అపార్టుమెంట్‌లోకి వరద నీరు వచ్చి చేరుతోందని స్థానికులు ఆరోపించారు. నానక్ రామ్ గూడ ప్రధాన రహదారికి ఎగువున ఉన్న తౌతాని కుంట చెరువు నీరు.. దిగువవైపు ఉన్న భగీరథమ్మ చెరువుకు వెళ్లే కాలువ లింకు తెగిందని స్థానికులు తెలిపారు.
Read Also: YS Jagan Kadapa Tour: రేపటి నుంచి కడప జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన..
వరదనీటి కాలువలను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలు, దుకాణాలను తొలగించాలని కమిషనర్ ఆదేశించారు. చెరువులకు ఆనుకుని ఉన్న స్థలాలు తమవంటూ పలువురు కమిషనర్‌ను కలువగా.. పూర్తి వివరాలను హైడ్రాకు సమర్పిస్తే క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని హైడ్రా కమిషనర్ చెప్పారు. ఇదిలా ఉంటే.. నార్సింగ్ దగ్గర మూసి నది పరీవాహక ప్రాంతాన్ని రంగనాథ్ పరిశీలించారు. కొన్ని నిర్మాణ సంస్థలు మూసి నదిలోకి పోసిన మట్టిని తొలగించాలని ఆదేశించారు. బఫర్ జోన్‌లో మట్టి పోస్తే ఆయా సంస్థలపై చర్యలుంటాయని హైడ్రా కమిషనర్ రంగనాథ్ హెచ్చరించారు.