Aam Admi Party: మాజీ మంత్రి మనీష్ సిసోడియా తీహార్ జైలులోని జైలు నంబర్ 1లో అత్యంత భయంకరమైన నేరస్థులలో ఉంచబడ్డారని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఆరోపించింది. మనీష్ సిసోడియా ప్రాణాలకు ముప్పు కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆప్ ఎమ్మెల్యే సౌరభ్ భరద్వాజ్ ఆరోపించారు. ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రిని విపాసనా సెల్‌లో ఉంచాలని కోర్టు ఆదేశించినప్పటికీ, ఆయనను జైలు నంబర్ 1లో ఉంచడంపై జైలు పరిపాలనను ఆయన ప్రశ్నించారు. మనీష్ సిసోడియాను ధ్యానం చేసే సెల్‌లో ఉంచాలని ఢిల్లీ కోర్టు స్పష్టంగా ఆదేశించిందని సౌరభ్ భరద్వాజ్ హైలైట్ చేశారు. తీహార్ జైలులోని ఒకటో నెంబర్ సెల్‌లో కరుడుగట్టిన నేరస్తులను నిర్బంధిస్తారని, ఇదే సెల్‌లో మనీష్ సిసోడియాను కూడా వేయడంతో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎంను మట్టుబెట్టేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందా అని ఆప్ నేత, ఆ పార్టీ ప్రతినిధి సౌరవ్ భరద్వాజ్ కమలం పార్టీని ప్రశ్నించారు.
జైలు నంబర్ 1లోని ఖైదీలకు హింసాత్మక సంఘటనల చరిత్ర ఉందని, వారిలో చాలా మంది మానసిక అనారోగ్యంతో ఉన్నారని ఆయన ఆరోపించారు. ”అనేక కుట్రలు పన్నినా ఢిల్లీలో వరుసగా మూడు ఎన్నికల్లో ఆప్‌ని బీజేపీ ఓడించలేకపోవడమే ఇలాంటి విపరీతమైన చర్యలకు పూనుకున్నట్లుంది. ఇది భారత ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమైన సంకేతం’’ అని సౌరభ్ భరద్వాజ్ ఆరోపించారు. మనీష్ సిసోడియా వంటి అండర్ ట్రయల్‌లో ఉన్న వ్యక్తిని దేశంలో అత్యంత ప్రమాదకరమైన, హింసాత్మక నేరస్థులతో ఉంచడంపై కేంద్రం సమాధానం చెప్పాలని ఆప్ డిమాండ్ చేసింది.
Read Also: Australia PM: అహ్మదాబాద్‌లోని సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించిన ఆస్ట్రేలియా ప్రధాని
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో రౌస్ అవెన్యూ కోర్టు మార్చి 20 వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపిన తర్వాత ఆప్ నాయకుడిని సోమవారం మధ్యాహ్నం తీహార్ జైలుకు తరలించారు. 51 ఏళ్ల మనీష్ సిసోడియా సీసీటీవీ నిఘాలో ఉన్నారు. భగవద్గీత, కళ్లద్దాలు, మందులను జైలుకు తీసుకెళ్లేందుకు సిసోడియాను అనుమతించిన కోర్టు, విపస్సనా ధ్యానం చేసేందుకు అనుమతించాలన్న ఆయన అభ్యర్థనను పరిశీలించాలని తీహార్ జైలు అధికారులను ఆదేశించింది. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో మనీష్ సిసోడియాను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ఫిబ్రవరి 26న అరెస్టు చేసింది. ఎనిమిది గంటలపాటు విచారణ అనంతరం దర్యాప్తు సంస్థ ఆయనను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.