Vegulla Jogeswara Rao: అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి అనుచిత వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి.. వైసీపీ ప్రచార రథం ఫ్లెక్సీని టీడీపీ మద్దతుదారులు చించేశారు. దీనితో మెర్నిపాడు గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జోగేశ్వరరావు చర్యలతో గ్రామస్తులు ఆందోళనకు దిగారు. పోలీసులు పరిస్థితిని చక్కదిద్దిడంతో వివాదం సద్దుమనిగింది..
అయితే, రౌడీరాజ్యం.. గూండా రాజ్యం అంటూ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన టీడీపీ మండపేట ఎమ్మెల్యే అభ్యర్థి వేగుళ్ల జోగేశ్వరరావు.. తాజాగా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి.. మండలంలోని మెర్నిపాడు ఎన్నికల ప్రచారంలో ‘ఎదురుగా ఉన్న అధికార పక్షం ప్రచార రథాన్ని తొక్కించుకుపోండి.. ఎవడు అడ్డు వచ్చి ఆపుతాడో నేను చూస్తా’ అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే వేగుళ్ల వ్యాఖ్యలపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. దీంతో స్థానికులు ఆందోళనకు దిగారు. ఈ ఘటన మెర్నిపాడు గ్రామంలో చోటుచేసుకుంది. వైసీపీ ఎన్నికల ప్రచార రథం అదే గ్రామంలో తిరుగుతోంది. ఇదే సమయంలో టీడీపీ అభ్యర్థి జోగేశ్వరరావు ఎన్నికల ప్రచారం కోసం అదే గ్రామానికి వచ్చారు. ఎదురుగా వైసీపీ ప్రచార రథం కనిపించడంతో ఆయన విచక్షణ కోల్పోయారు. వాస్తవానికి వేగుళ్ల ప్రచార రథానికి వైసీపీ ప్రచార రథం ఏమాత్రం అడ్డుగా లేదు. అయినప్పటికీ కొందరు టీడీపీ కార్యకర్తలు ఆటోపై పడి ఫ్లెక్సీలు చింపి వేశారు. అయితే ఆటో డ్రైవర్ స్థానికుడు కావడంతో ఇదేం దౌర్జన్యం అంటూ టీడీపీ కార్యకర్తలను నిలదీశాడు. ఈ దశలో టీడీపీ కార్యకర్తలకు ఆటో డ్రైవర్ కు మధ్య వాగ్వాదం తలెత్తింది.
అయితే, ఈ తరుణంలో ఇరువర్గాలను శాంతపరచాల్సిన ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న వేగుళ్ల జోగేశ్వరరావు.. ‘తొక్కించుకుంటూపోండి.. ఆపేదెవడో నేనూ చూస్తా’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దాంతో ఆటో డ్రైవర్‌కు మద్దతుగా చుట్టుపక్కల వారు చేరి.. టీడీపీ ఎన్నికల ప్రచార రథం ఎదుట ఆందోళనకు దిగారు. ‘తొక్కించుకుపోండి మీరూ కూడా మా గ్రామం నుంచి బయటకు ఎలా వెళ్తారో చూస్తాం’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. వివాదం కాస్తా పెద్దది కావడంతో గ్రామంలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విషయం తెలుసుకున్న మండపేట రూరల్ పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలనూ శాంతింపజేసి, అక్కడి నుంచి పంపించి వేశారు.