Marriage in Uttarpradesh: పెళ్లంటే నూరేళ్ల జీవితంలో కష్టసుఖాల్లో పాలుపంచుకోవడం అంటారు. కానీ ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ జిల్లాలో జరిగిన పెళ్లి గంటలోనే ముగిసింది. అస్మోలి పోలీస్ స్టేషన్ పరిధిలోని దబోయి ఖుర్ద్ గ్రామంలో పెళ్లి వేడుకలు జరుగుతున్నాయి. బంధువులు, స్నేహితులు అందరూ ఆ వివాహ వేడుకలకు హాజరయ్యారు. వారి సమక్షంలో వైభవంగా పెళ్లి జరిగింది. వారందరూ హ్యాపీగా ఉండగానే అనుకోని అతిథి పెళ్లిమండపానికి రావడంతో సమస్య మొదలైంది. ఆ అతిథి మరెవరో కాదు పెళ్లి కొడుకు మొదటి భార్య. మొదటి భార్య ఉండగానే రెండో వివాహం చేసుకున్నాడు ఓ వ్యక్తి. ఈ విషయం తెలుసుకున్న మొదటి భార్య వాగ్వాదానికి దిగడం వల్ల.. పెళ్లైన గంటకే రెండో భార్యకు విడాకులు ఇచ్చాడు. అనంతరం ఆమెను తన సోదరుడికి ఇచ్చి వివాహం చేశాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని సంభాల్ జిల్లాలో జరిగింది.
Read Also: Covid 19: షాకింగ్ న్యూస్.. పురుషుల వీర్యం నాణ్యత, సంతానోత్పత్తిపై కరోనా ప్రభావం..
తన భర్త మరో పెళ్లి చేసుకుంటున్నాడని తెలుసుకున్న మొదటి భార్య మండపానికి ఆగ్రహంతో పరిగెత్తుకుంటూ వచ్చింది. ఆవేశంతో తాను బతికి ఉండగానే రెండో పెళ్లి ఎలా చేసుకుంటావని భర్తతో గొడవకు దిగింది. గొడవ పెద్దది కావడంతో గ్రామస్థులు అక్కడికి చేరుకున్నారు. మరోవైపు భార్యకు నచ్చజెప్పేందుకు భర్త ప్రయత్నించినప్పటికీ ఆమె వినిపించుకోలేదు. విషయం పోలీసులకు చేరడంతో వారొచ్చి అతడిని స్టేషన్‌కు తీసుకెళ్లారు. మరోవైపు, గ్రామ పెద్దలు సమావేశమై ఈ సమస్యకు చక్కని పరిష్కారం ఆలోచించారు. గంట క్రితం పెళ్లి చేసుకున్న రెండో భార్యకు విడాకులిచ్చి ఆమెను అతడి తమ్ముడికిచ్చి వివాహం చేస్తే ఏ గొడవా ఉండదని ప్రతిపాదించారు. ఈ సలహా నచ్చడంతో మొదటి భార్య కూడా సైలెంట్ అయింది. దీంతో గంట క్రితం వివాహం చేసుకున్న అమ్మాయికి విడాకులిచ్చిన భర్త.. ఆమెను తన తమ్ముడికిచ్చి అక్కడే పెళ్లి జరిపించాడు. దీంతో పోలీసు కేసుల గొడవ లేకుండానే సమస్య పరిష్కారమైంది. రెండో వివాహం చేసుకున్న ఆ వ్యక్తి 4ఏళ్ల క్రితం మొదటి పెళ్లి జరిగింది. ఆ తర్వాత దంపతుల మధ్య మనస్పర్థలు రావడంతో భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో అతడు రెండో పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. దీంతో సమస్య మొదలైంది. ఈ ఘటనపై ఇరువైపుల నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.