కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి నిన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. అంతేకాకుండా అమిత్ షాతో అనంతరం కాంగ్రెస్ పార్టీతో పాటు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. తాను తప్పని పరిస్థితుల్లో కాంగ్రెస్ వీడుతున్నట్లు శశిధర్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణలో టీఆర్ఎస్ ను ఎదుర్కొనే పరిస్థితి కాంగ్రెస్ లో లేదన్న శశిధర్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీకి క్యాన్సర్ సోకిందని వ్యాఖ్యానించారు. అది నయం చేయలేని స్థితికి చేరుకుందని శశిధర్ రెడ్డి అన్నారు. అయితే.. ఢిల్లీలో అమిత్ షా తో భేటీ అయిన మర్రి శశిధర్ రెడ్డి త్వరలోనే బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మర్రి శశిధర్ రెడ్డి వ్యాఖ్యలపై టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి స్పందించారు.
Also Read : Nidhhi Agerwal: ఆ తమిళ డైరెక్టర్.. అందరిముందు ‘ఆ పని’ చేయమన్నాడు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమిత్ షాను కలిసిన తర్వాత బయటకు వచ్చి మర్రి శశిధర్ రెడ్డి కాంగ్రెస్ పైన, పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పైన చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. కాంగ్రెస్ పార్టీ 140 ఏళ్ల చరిత్ర ఉందని.. ఎంతో మంది వచ్చారని, పోయారని అయినా పార్టీ నిలబడిందని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీకి కాన్సర్ వచ్చిందని మర్రి శశిధర్ రెడ్డి అనడం తల్లి పాలు తాగి రొమ్ము గుద్దిన చందంగా ఉందని ఆయన మండిపడ్డారు. పార్టీ మారి బీజేపీలో చేరాలని అనుకునే వారు, వారికి పోయే స్వేచ్ఛ ఉందని, కానీ కాంగ్రెస్ ను నిందించే హక్కు లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరు ఎలాంటి వారో ఏ పార్టీ ఎలాంటిదో భవిష్యత్‌లో తేలిపోతుందని ఆయన అన్నారు.