Trimbakeshwar Temple: ప్రసిద్ధ త్రయంబకేశ్వర్ ఆలయంలోకి బలవంతంగా చొరబడ్డారనే ఆరోపణలపై మహారాష్ట్రలోని నాసిక్‌లో నలుగురు ముస్లిం పురుషులను పోలీసులు అరెస్టు చేసి, కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) కూడా ఏర్పాటు చేసింది. ఆలయ ట్రస్ట్ ఫిర్యాదు మేరకు నిందితులు అకిల్ యూసుఫ్ సయ్యద్, సల్మాన్ అకిల్ సయ్యద్, మతిన్ రాజు సయ్యద్, సలీం బక్షు సయ్యద్‌లను మంగళవారం అరెస్టు చేశారు. మే 13న నలుగురు వ్యక్తులు ఊరేగింపులో భాగంగా ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించి, శివలింగానికి చాదర్ సమర్పించేందుకు ప్రయత్నించినప్పుడు ఈ సంఘటన జరిగింది. గొప్ప ముస్లిం సాధువుల ఉర్స్ (వర్థంతి)లో భాగంగా వారి గౌరవార్థం చెప్పుల ఊరేగింపు జరుగుతుంది.
శివుని 12 జ్యోతిర్లింగాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందిన త్రయంబకేశ్వర్ ఆలయంలో హిందువులకు మాత్రమే ప్రవేశానికి అనుమతి ఉంది.గుంపును పవిత్ర స్థలంలోకి ప్రవేశించకుండా సెక్యూరిటీ గార్డులు అడ్డుకోవడంలో విఫలమయ్యారు. దీంతో ఆలయ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ విషయం అందరి దృష్టిని ఆకర్షించింది. మరోవైపు.. ఏళ్ల తరబడి గంధం రోజు శివుడికి చాదర్ చూపిస్తున్నామని, గుడి లోపలికి వెళ్లడం లేదని ఊరేగింపు నిర్వాహకుడు మతిన్ సయ్యద్ తెలిపారు. నిందితులు శివలింగానికి చాదర్ సమర్పించడానికి ప్రయత్నించలేదని, వారు చాదర్‌ను ఆలయ మెట్లకు మాత్రమే తీసుకెళ్లారని ఆయన పేర్కొన్నారు. ఆలయ ట్రస్టు ఫిర్యాదు మేరకు మంగళవారం నలుగురిని అరెస్ట్ చేసి ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) సెక్షన్ 295, 511 కింద కేసు నమోదు చేశారు.
Read Also: Fraud: బోగస్ కంపెనీలను పెట్టి.. బ్యాంకుల నుంచి కోట్లు కొల్లగొట్టిన గ్యాంగ్ అరెస్ట్
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా సిట్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మహారాష్ట్రలో శాంతిభద్రతలను కాపాడాలనే తన కృతనిశ్చయాన్ని ఫడ్నవీస్ ఒక ట్వీట్‌లో వ్యక్తం చేస్తూ, “నేను నిన్న చెప్పినట్లు, మహారాష్ట్రలో శాంతిభద్రతలకు భంగం కలిగించడానికి ప్రయత్నించేవారిని విడిచిపెట్టలేము! ఇవి ఉద్దేశపూర్వక ప్రయత్నాలు. ఇది జరగదు. మా పోలీసులు అలర్ట్ మోడ్‌లో ఉన్నారు.!” అని ఆయన ట్వీట్ చేశారు.