మెదక్ జిల్లా ఇందిరాగాంధీ ఖిల్లా అని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. కేసీఆర్ సీఎం ఉన్నప్పుడు వెలగబెట్టింది ఏమీ లేదన్నారు. మెదక్ లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన భారీ ర్యాలీలో ఆయన ప్రసంగించారు. ఉద్యమ నాయకుడని కేసీఆర్ ని గెలిపిస్తే అప్పుల కుప్ప చేసి తెలంగాణని దోచుకున్నారని విమర్శించారు. ఏడున్నర లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి కేసీఆర్ ఫామ్ హౌస్ లో నిద్రపోతున్నారని ఆరోపించారు. కేసీఆర్ చేసిన అప్పును నెత్తిన పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ మోస్తుందని.. అయినా సంక్షేమ పథకాలు అందజేస్తున్నామన్నారు. బనకచర్ల విషయంలో సంతకం పెట్టి తప్పు చేసింది హరీష్ రావు అని ఆరోపించారు. ఆరడుగుల పెరిగిన హరీష్ రావుకి బుద్ధి లేదని తీవ్రంగా విమర్శించారు. స్వయంగా కేంద్ర మంత్రి, సీఎం చెప్పిన ఆయనకి నమ్మకం లేదన్నారు. అసెంబ్లీకి రండి అంటే కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటికి రావడం లేదన్నారు. సీఎం రేవంత్ ఫామ్ హౌస్ కి వస్తా అంటే సమాధానం లేదని
చెప్పారు.
READ MORE: Viral Video: స్టేటస్ లేక పిచ్చా..? చాండిలియర్‌గా ఫెరారీ కార్ ఏంటి భయ్యా..!
తెలంగాణ సీఎంగా ఉండి రాయలసీమను రతనాల సీఎం చేస్తా అన్నది కేసీఆర్ కాదా? అని మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. “బనకచర్ల విషయంలో కచ్చితంగా తెలంగాణ హక్కులు కాపాడుతాం. వచ్చే ఎన్నికల నాటికి బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ఉండదు. వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు గెలిచి అధికారంలోకి వస్తాం. బీసీలపై కవిత మాట్లాడే మాటలు చూసి జనాలు నవ్వుకుంటున్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల గురించి చర్చించేటప్పుడు లిక్కర్ రాణి కవిత జైల్లో ఉన్నారు. ఐదేళ్లు మహిళ మంత్రులు లేకుండా బీఆర్ఎస్ క్యాబినెట్ నడిచింది. ఇప్పుడు కవిత మాటలు చూస్తే నవ్వాలా..? ఏడ్వాలా..? అర్థం కావట్లేదు. మతం పేరుతో రాజకీయాలు చేసి బీజేపీ అధికారంలోకి వచ్చింది. ప్రధాని మోడీ హామీకి ఇప్పటి వరకు 23 వేల కోట్ల ఉద్యోగాలు రావాలి కానీ ఇవ్వలేదు. ఉద్యోగాల మాట దేవుడెరుగు ఉన్న ఉద్యోగాలు తీసేసి కార్పొరేట్ శక్తులకు అప్పగిస్తున్నారు. బీజేపీకి రాముడికి అసలు సంబంధం లేదు. దేవుళ్ళ పేర్లు చెప్పి ఓట్లు అడగడం తప్ప బిజెపి ఏమి చేసిందో చెప్పాలి. సీఎం హోదాలో ఏనాడైనా కేసీఆర్ ఏడు పాయలకి వచ్చారా..? సీఎం రేవంత్ వచ్చి నిధులు కూడా మంజూరు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు కాంగ్రెస్ దే.” అని ఆయన వ్యాఖ్యానించారు.