Yadagirigutta: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయంలో బంగారు విమాన గోపుర మహా కుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవం ఘనంగా జరగనుంది. ఈ మహోత్సవంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు. ముఖ్యమంత్రి ఉదయం 11:00 గంటలకు హెలిప్యాడ్ ద్వారా యాదగిరిగుట్టకు రానున్నారు. అనంతరం 11:25 నుండి 12:15 వరకు జరిగే కుంభాభిషేకంలో పాల్గొననున్నారు. ఇక ముఖ్యమంత్రి పర్యటనను దృష్టిలో ఉంచుకొని ఆలయ అధికారులు కొంతకాలం భక్తుల ప్రవేశాన్ని పరిమితం చేశారు. ఉదయం 9 గంటల నుంచి భక్తులకు దర్శనాలు నిలిపివేయనున్నట్లు అధికారులు తెలిపారు. 12:25 నుండి 12:45 వరకు సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేల కోసం ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం 1:30 గంటలకు సీఎం హెలిప్యాడ్ నుంచి తిరిగి హైదరాబాద్‌కు వెళ్లనున్నారు.
Read Also: GHMC Tender: కేబీఆర్ పార్క్ చుట్టూ స్టీల్ బ్రిడ్జిలు, అండర్ పాస్లు.. టెండర్ నోటిఫికేషన్ విడుదల
ఇక గుడిలోని నిత్య కైంకర్యాలలో మార్పులను చేసారు ఆలయ అధికారులు. సీఎం పర్యటన కారణంగా ఆలయ నిత్య పూజా కార్యక్రమాలలో స్వల్ప మార్పులు చేపట్టారు. ఉదయం, సాయంత్రం బ్రేక్ దర్శనాలు.. ఉచిత దర్శనాలు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం వరకు, రూ.150 టికెట్ దర్శనాలు, నిత్య కళ్యాణోత్సవాలు, పుష్పార్చనలను అధికారులు రద్దు చేసారు. ఇకపోతే యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో నిర్మించిన బంగారు విమాన గోపురం దేశంలోనే అతిపెద్దది కావడం విశేషం. ఈ గోపురం ఎత్తు 50.5 అడుగులు. గోపుర మొత్తం వైశాల్యం 10,759 చదరపు అడుగులు, స్వర్ణ తాపడం కోసం 68 కిలోల బంగారం వినియోగించారు. డిసెంబర్ 1, 2024 తాపడం పనులు ప్రారంభం కాగా, ఫిబ్రవరి 18, 2025 నాటికీ ఈ తాపడం పనులు పూర్తయ్యాయి. ఈ పంచతల స్వర్ణ శోభిత బంగారు విమాన గోపురం తాపడం ప్రాజెక్ట్ కోసం మొత్తం రూ.80 కోట్లు ఖర్చు చేసారు అధికారులు.