Madras High Court: తల్లి సంక్షరణ గురించి విస్మరించిన కూతురికి ఆమె ఆస్తిపై హక్కులు ఉండవని మద్రాస్ హైకోర్టు తీర్పునిచ్చింది. తల్లి ఆలనాపాలనా చూసుకోని ఓ కూతురు.. ఆస్తి రిజిస్ట్రేషన్ హక్కులను రద్దు చేస్తూ ఓ రెవెన్యూ అధికారి ఇచ్చిన ఉత్తర్వులను న్యాయస్థానం సమర్థించింది. అసలేం జరిగిందంటే.. తమిళనాడులోని తిరుపుర్ జిల్లా ఉడుమలైపేట్‌కు చెందిన రాజమ్మాళ్ తనకు చెందిన 3 ఎకరాల భూమిని కూతురు సుగుణ పేరిట 2016లో రిజిస్ట్రేషన్ చేయించింది. ముందస్తు ఒప్పందం ప్రకారం.. సుగుణ తన ఆలనాపాలనా చూసుకోవడం లేదని ఆస్తి రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయాలని ఉడుమలైపేట్ రెవెన్యూ అధికారికి రాజమ్మాళ్ ఫిర్యాదు చేసింది. రెవెన్యూ అధికారి దర్యాప్తు జరిపి, సుగుణ ఆస్తి రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ సుగుణ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
Also Read: No Confidence Motion: కేంద్రంపై అవిశ్వాస తీర్మానం.. నోటీసులిచ్చిన కాంగ్రెస్, బీఆర్‌ఎస్
తన ఆలనాపాలనా చూసుకుంటుందని కూతురు సుగుణకు రాజమ్మాల్ ఆస్తి రాసిచ్చిందని.. కానీ కుమార్తె ఆమెను పట్టించుకోవడం లేదని విచారణ సందర్భంగా మద్రాస్ హైకోర్టులో రెవెన్యూ అధికారి వెల్లడించారు. అందుకే రిజిస్ట్రేషన్ హక్కులను రద్దు చేసినట్లు తెలిపారు. విచారణ జరిపిన మద్రాస్ హైకోర్టు అధికారి తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ ఉత్తర్వుల పట్ల కోర్టు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు.