son carry mother’s dead body on bike: మధ్యప్రదేశ్ లో మరోసారి ప్రభుత్వ ఆస్పత్రుల నిర్లక్ష్యం బయటపడింది. తల్లి శవాన్ని బైక్ పై స్వగ్రామానికి తీసుకెళ్లాడు ఓ కుమారుడు. అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో.. బైక్ పై తల్లి శవాన్ని పెట్టుకుని సొతూరుకు వెళ్లారు. ఇప్పుడు ఈ వీడియోలు, ఫోటోలు ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి. సామాన్యుడికి అందాల్సిన కనీస సౌకర్యాలను కూడా ప్రభుత్వాలు కల్పించలేకపోతున్నాయని పలువురు ప్రజలు మండి పడుతున్నారు.
వివరాల్లోకి వెళితే మధ్యప్రదేశ్ షాదోల్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. మధ్యప్రదేశ్ అనుప్పూర్ జిల్లా గోదారు గ్రామానికి చెందిన జైమంత్రికి శనివారం ఛాతి నొప్పి రావడంతో స్థానిక ఆస్పత్రిలో చేర్పించారు. అయితే అక్కడ నుంచి ఆమెను షాదోల్ కు రిఫర్ చేశారు. షాహదోల్ మెడికల్ కాలేజ్ అండ్ హస్పిటల్ లో జైమంత్రిని చేర్పించి చికిత్స అందించారు. అయితే పరిస్థితిలో మార్పు రాకపోవడంతో ఆమె శనివారం చనిపోయింది. అయితే తల్లి మృతదేహాన్ని తరలించేందుకు అంబులెన్స్ కు నిరాకరించడంతో.. ఓ ప్రైవేట్ వాహనాన్ని బుక్ చేసుకునేందుకు ప్రయత్నించాడు కొడుకు. అయితే రూ.5000 ఛార్జ్ చేయడంతో అంత భరించే శక్తి లేని బాధితుడు తన తల్లి శవాన్ని బైక్ వెనకాల ఓ చెక్కపై పడుకోబెట్టి గట్టిగా కట్టి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న తన సొంత గ్రామానికి తీసుకెళ్లాడు. ఇప్పుడు ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.
Read Also: Student Gets 151 Out Of 100 Marks: వందకు 151 మార్కులు.. స్పందించిన బీహార్ విద్యాశాఖ మంత్రి
ఇదొక్కటే కాదు మధ్యప్రదేశ్ లో ఇటీవల ఇలాంటి తరహా ఘటనలే కొన్ని జరిగాయి. గతంలో ఛతర్ పూర్ జిల్లాలో ఓ కుటుంబం తమ నాలుగేళ్ల కుమార్తె మృతదేహాన్ని కూడా ఇలాగే తీసుకెళ్లాల్సి వచ్చింది. మొరెనా జిల్లాలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. ఎనిమిదేళ్ల బాలుడు తన రెండేళ్ల తమ్ముడి శవాన్ని ఒళ్లో పడుకోబెట్టుకుని ఓ రోడ్డు పక్కన ఉన్న దృశ్యం కంటతడిపెట్టించింది. తండ్రి కొడుకు శవాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లేందుకు అంబులెన్స్ నిరాకరించడంతో ఈ ఘటన జరిగింది.